పుణే ‘సూపర్‌’ | Rising Pune Supergiants win against Mumbai Indians | Sakshi
Sakshi News home page

పుణే ‘సూపర్‌’

Published Fri, Apr 7 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

పుణే ‘సూపర్‌’

పుణే ‘సూపర్‌’

ముంబై ఇండియన్స్‌పై విజయం
రహానే, స్మిత్‌ అర్ధ సెంచరీలు
హార్దిక్‌ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌ వృథా  


గత సీజన్‌లో ఎదురైన పరాభవాన్ని మరచిపోయేందుకు సరి‘కొత్త’గా తయారైన రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌ తొలి మ్యాచ్‌లోనే జోరు చూపింది. ఆరంభంలో బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ముంబై ఇండియన్స్‌ను స్పిన్నర్‌ తాహిర్, పేసర్‌ రజత్‌ భాటియా కట్టడి చేయగా.. ఆ తర్వాత కెప్టెన్‌ స్మిత్, రహానే అదరగొట్టే ఆటతీరుతో జట్టును విజయం దిశగా నడిపించారు.

పుణే: కొత్త కెప్టెన్‌ రాకతో రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌ ఆటతీరు కూడా మారింది. అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌ రెండు విభాగాల్లోనూ సమష్టిగా రాణించిన జట్టు ఐపీఎల్‌ పదో సీజన్‌లో బోణీ కొట్టింది. చివరి ఓవర్‌లో 13 పరుగులు రావాల్సి ఉండగా తొలి మూడు బంతులు సింగిల్స్‌ రావడంతో ఉత్కంఠ నెలకొన్నా... మరో రెండు బంతులను కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (54 బంతుల్లో 84 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సిక్సర్లుగా మలచడంతో పుణే గట్టెక్కింది. అజింక్యా రహానే (34 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పుణే ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నితిష్‌ రాణా (28 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడగా చివర్లో హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 35 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌ 19.5 ఓవర్లలో మూడు వికెట్లకు 187 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో అతి ఖరీదైన ఆటగాడిగా నిలిచిన స్టోక్స్‌ బౌలింగ్‌లో ఓ వికెట్‌ తీయగా బ్యాటింగ్‌లో 21 (14 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు మాత్రమే చేశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు స్మిత్‌కి దక్కింది.

చివర్లో ధనాధన్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. తొలి ఓవర్‌లోనే 11 పరుగులు రాబట్టింది. అయితే దిండా వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో పార్థివ్‌ (14 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను థర్డ్‌ మ్యాన్‌లో ఉన్న రజత్‌ భాటియా జారవిడిచాడు. బెన్‌ స్టోక్స్‌ తను వేసిన తొలి ఓవర్‌లోనే బట్లర్‌ రెండు సిక్సర్లు బాది జోరు చూపాడు. ఇమ్రాన్‌ తాహిర్‌  వేసిన తొలి ఓవర్‌లోనే పార్థివ్‌ను బౌల్డ్‌ చేయడంతో తొలి వికెట్‌కు 25 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆరో ఓవర్‌లో బట్లర్‌ మరోసారి విరుచుకుపడి వరుస బంతుల్లో 4,6 తో రెచ్చిపోయాడు. అయితే తాహిర్‌ తన రెండో ఓవర్‌ మూడు బంతుల్లో కెప్టెన్‌ రోహిత్‌ (3), ధాటిగా ఆడుతున్న బట్లర్‌ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు)ను అవుట్‌ చేయడంతో ముంబై షాక్‌కు గురైంది. ఆ తర్వాత  రాణా, పొలార్డ్‌ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ముంబైని ఆదుకునే ప్రయత్నం చేశారు. చివరి ఓవర్‌లో హార్దిక్‌ పాండ్యా  వరుసగా 6,6,6,4,6 బాదడంతో జట్టు స్కోరు అమాంతం 154 పరుగుల నుంచి 184 పరుగులకు చేరింది.

రహానే, స్మిత్‌ అదుర్స్‌: పుణే ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌ నుంచి అజింక్యా రహానే తన విశ్వరూపాన్ని ప్రదర్శిచాడు. హార్ధిక్‌ వేసిన ఆ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదగా మూడో ఓవర్‌లో వరుసగా 6,4తో చెలరేగాడు. కానీ మూడో ఓవర్‌లో మయాంక్‌ (6) వికెట్‌ను మెక్లీనగన్‌ తీశాడు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఈ దశలో రహానేకు సహకారం అందించాడు. మెక్లీనగన్‌ మరుసటి ఓవర్‌లో స్మిత్‌ ఫోర్‌తో పాటు రహానే వరుసగా సిక్స్, ఫోర్‌ బాదాడు. దీంతో పవర్‌ప్లేలో పుణే 59 పరుగులు చేసింది. 9వ ఓవర్‌లో రహానే  బౌండరీతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే సౌతీ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో రహానే సూపర్‌ ఇన్నింగ్స్‌ నితిష్‌ రాణా అద్భుత డైవ్‌ క్యాచ్‌తో ముగిసింది. అయితే అటు స్మిత్‌ జోరు మాత్రం ఆగలేదు. అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచాడు. 13వ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన స్మిత్‌ చివరి బంతికి ఇచ్చిన క్యాచ్‌ను రాణా మిస్‌ చేసి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 37 బంతుల్లో తను అర్ధ సెంచరీ చేశాడు. 19వ ఓవర్‌లో ధోని (12 బంతుల్లో 12 నాటౌట్‌; 1 ఫోర్‌) ఇచ్చిన క్యాచ్‌ను సౌతీ అందుకోలేకపోయాడు. చివరి ఓవర్‌లో స్మిత్‌ జోరుతో పుణే నెగ్గింది.

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: పార్థివ్‌ (బి) తాహిర్‌ 19; బట్లర్‌ ఎల్బీడబ్లు్య (బి) తాహిర్‌ 38; రోహిత్‌ (బి) తాహిర్‌ 3; రాణా (సి) భాటియా (బి) జంపా 34; రాయుడు (సి అండ్‌ బి) భాటియా 10; కృనాల్‌ పాండ్యా (సి) ధోని (బి) భాటియా 3; పొలార్డ్‌ (సి) మయాంక్‌ (బి) స్టోక్స్‌ 27; హార్దిక్‌ పాండ్యా నాటౌట్‌ 35; సౌతీ రనౌట్‌ 7; మెక్లీనగన్‌ నాటౌట్‌ 0;  ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం (20 ఓవర్లలో 8వికెట్లకు) 184.
వికెట్ల పతనం: 1–45, 2–61, 3–62, 4–92, 5–107, 6–125, 7–146, 8–183
బౌలింగ్‌: దిండా 4–0–57–0 ; దీపక్‌ చహర్‌ 2–0–21–0; స్టోక్స్‌ 4–0–36–1; తాహిర్‌ 4–0–28–3; జంపా 3–0–26–1; భాటియా 3–0–14–2
రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) రాణా (బి) సౌతీ 60; మయాంక్‌ అగర్వాల్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) మెక్లీనగన్‌ 6; స్మిత్‌ నాటౌట్‌ 84; స్టోక్స్‌ (సి) సౌతీ (బి) హార్దిక్‌ పాండ్యా 21; ధోని నాటౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 4; (19.5 ఓవర్లలో 3 వికెట్లకు) 187
వికెట్ల పతనం: 1–35, 2–93, 3–143
బౌలింగ్‌: సౌతీ 4–0–34–1, హార్దిక్‌ పాండ్యా 4–0–36–1; మెక్లీనగన్‌ 4–0–36–1; బుమ్రా 4–0–29–0; కృనాల్‌ పాండ్యా 2–0–21–0, పొలార్డ్‌ 1.5–0–30–0  

►ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌   గుజరాత్‌ లయన్స్‌  &  కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
వేదిక: రాజ్‌కోట్‌;   రాత్రి. గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement