రియోలో వసతిపై భారత హాకీ జట్టు ఫిర్యాదు
రియో డి జనీరో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ జరుగనున్న రియోలో వసతులు దయనీయంగా ఉన్నాయంటూ భారత హాకీ జట్టు ఫిర్యాదు చేసింది. ఒలింపిక్స్ విలేజ్లో తాము బస చేసే చోట కనీసం కూర్చోవడానికి తగినన్ని కుర్చీలు లేవని భారత చీఫ్ కోచ్ ఓల్ట్మన్స్ ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఆటగాళ్లు ఉండే అపార్ట్మెంట్లలో ఇంకా పూర్తిగా సిద్ధం చేయలేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు రియోలో భారత వ్యవహారాలను పర్యవేక్షించే రాకేశ్ గుప్తాకు లేఖలో తెలియజేశారు.
'మాకు ఇంకా పూర్తికాని అపార్ట్మెంట్లు కేటాయించారు. ఇక్కడ కనీసం కుర్చీలు కూడా లేవు. దాంతో పాటు తగినన్ని టీవీ సెట్లు కూడా లేవు. పురుషుల హాకీ జట్టుతో పాటు మహిళా క్రీడాకారిణులు పరిస్థితి ఇలానే ఉంది . సరైన టేబుల్స్ కూడా లేదు' అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తొమ్మిది అపార్ట్మెంట్లలో ఉంటున్న పురుష, మహిళా హాకీ జట్లకు ఇంకా 28 కుర్చీలు అవసరమని పేర్కొన్నారు. దాదాపు ఏడు అపార్ట్మెంట్లలో కనీసం ఒక్కో టేబుల్ ను అమర్చడంతో పాటు, ఒలింపిక్స్ గేమ్స్ జరిగే సమయంలో మ్యాచ్లను చూడటానికి కూడా తగినన్ని టీవీ సెట్లు సిద్ధం చేయాలన్నారు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ల ఆట తీరును తెలుసుకోవడానికి టీవీలు దోహదం చేస్తాయన్నారు. తమ అభ్యర్థనను సాధ్యమైనంత తొందరగా అమలు చేయడానికి యత్నించాలని విన్నవించారు.