ఆరోసారి ఫైనల్‌కు...
► సత్తా చాటిన ఫెడరర్
►సెమీస్‌లో వావ్రింకాపై విజయం
►మహిళల ఫైనల్లో సెరెనా, వీనస్ అమీతుమీ
►ముగిసిన మిర్యానా పోరాటం
►ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్ తన జోరును కొనసాగిస్తున్నాడు. గతంలో ఈ టోర్నీలో నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన 35 ఏళ్ల ఈ స్విట్జర్లాండ్ దిగ్గజం ఆరేళ్ల అనంతరం ఫైనల్‌కు చేరి సత్తా చాటుకున్నాడు. గురువారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్, సహచర స్విస్ ఆటగాడు స్టాన్ వావ్రింకాతో జరిగిన హోరాహోరీ పోరులో 7–5, 6–3, 1–6, 4–6, 6–3 తేడాతో విజయం సాధించాడు. దీంతో 1974 అనంతరం ఓ గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరిన అతిపెద్ద వయస్కుడిగా ఫెడరర్ రికార్డు సృష్టించాడు. ఆ ఏడాది జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో 39 ఏళ్ల కెన్ రోజ్‌వాల్ బరిలోకి దిగాడు. ఫెడరర్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇది ఆరో ఫైనల్ కావడంతో పాటు ఓవరాల్‌గా 28వ గ్రాండ్ స్లామ్ ఫైనల్.
రాఫెల్ నాదల్, గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా)ల మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఫెడరర్ ఆదివారం జరిగే తుది పోరులో తలపడతాడు. 2015 యూఎస్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో పరాజయం తర్వాత ఫెడరర్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా... 2012లో వింబుల్డన్ గెలిచిన అనంతరం ఫెడరర్ మరో గ్రాండ్ స్లామ్ దక్కించుకోలేకపోయాడు. తాజా విజయంతో అతను తన ఏటీపీ ర్యాంకింగ్స్‌ను 17 నుంచి 14వ స్థానానికి మెరుగుపర్చుకున్నాడు. ఒకవేళ ఆదివారం జరిగే ఫైనల్లో నెగ్గితే తను టాప్–10లో చోటు దక్కించుకుంటాడు.
హోరాహోరీ...
2014 విజేత వావ్రింకాతో మూడు గంటల ఐదు నిమిషాల పాటు జరిగిన సెమీస్‌లో ఫెడరర్ తానేమిటో చాటుకున్నాడు. మోకాలి గాయంతో ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న ఈ 17 గ్రాండ్ స్లామ్స్ విజేత తొలి రెండు సెట్లలో పైచేయి సాధించాడు. తొలి సెట్‌లో ఫెడ్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించాడు. ప్రత్యర్థిని కోర్టుకు నలువైపులా తిప్పించి అలసిపోయేలా చేశాడు. ఇందులో ఫెడరర్ ఒక్కసారి కూడా సర్వీస్‌ను కోల్పోకపోగా ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశాడు. అయితే 11వ గేమ్‌లో బ్రేక్ పాయింట్‌ను కాచుకున్న వావ్రింకా తన తర్వాతి సర్వీస్‌లో ఫోర్‌హ్యాండ్ షాట్ నెట్‌కు తగలడంతో 50 నిమిషాల పాటు సాగిన తొలి సెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అలాగే రెండో సెట్‌నూ కోల్పోయిన తను కీలక మూడో సెట్‌ను కేవలం 26 నిమిషాల్లో దక్కించుకుని పోటీలో నిలిచాడు. నాలుగో సెట్ తొలి గేమ్‌ను చక్కటి బ్యాక్‌హ్యాండ్ రిటర్న్ విన్నర్‌తో వావ్రింకా బ్రేక్ చేశాడు. అలాగే తొమ్మిదో గేమ్‌లో మూడు బ్రేక్ పాయింట్లు సాధించి మ్యాచ్‌ను ఐదో సెట్‌కు తీసుకెళ్లాడు. కానీ ఇందులో వావ్రింకా పూర్తిగా గతి తప్పగా ఫెడరర్ విజృంభించాడు. ప్రత్యర్థి పేలవ సర్వీస్‌ను అవకాశంగా తీసుకున్న ఫెడెక్స్ డబుల్ బ్రేక్ పాయింట్లను సాధిస్తూ 4–2తో ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్‌ను దక్కించుకున్నాడు.
పేస్ జోడి అవుట్
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ – మార్టినా హింగిస్ జోడికి క్వార్టర్ ఫైనల్స్‌లో చుక్కెదురైంది. 3–6, 2–6 తేడాతో సామ్ గ్రోత్ – సమంతా స్టోసుర్ (ఆసీస్) జంట చేతిలో వీరిద్దరు ఓడారు. 12 ఏస్‌లతో అదరగొట్టిన ప్రత్యర్థి ఆట ముందు పేస్ జోడి నిలవలేకపోయింది. ఆలాగే అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నారు. సెమీస్‌లో గ్రోత్ – స్టోసుర్ జోడితో సానియా, ఇవాన్ డోడిగ్ ద్వయం తలపడుతుంది.
సెరెనా (vs) వీనస్
ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల ఫైనల్లో ఆసక్తికర పోరు జరగనుంది. అమెరికా అక్కాచెల్లెళ్లు వీనస్, సెరెనా విలియమ్స్ ఫైనల్‌కు చేరుకున్నారు. 2009లో చివరిసారిగా వీరిద్దరు ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో తలపడ్డారు. సెరెనా ఫైనల్లో గెలిస్తే ఓపెన్ శకంలో 23 గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా చరిత్రపుటల్లోకి ఎక్కుతుంది. మరోవైపు అనూహ్య ఫలితాలతో అందరినీ ఆకట్టుకున్న 34 ఏళ్ల మిర్యానా లూసిచ్ బరోని పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో ఈ క్రొయేషియా క్రీడాకారిణిపై సెరెనా 6–2, 6–1తో సునాయాసంగా నెగ్గింది. సెరెనాకిది 29వ గ్రాండ్ స్లామ్ ఫైనల్. అద్భుత పోరాట పటిమతో సెమీస్ వరకు చేరిన మిర్యానా.. ఈసారి మాత్రం సెరెనా పవర్ ముందు పూర్తిగా తేలిపోయింది. మరోవైపు తొలి సెమీస్‌లో 36 ఏళ్ల వీనస్ 6–7 (3), 6–2, 6–3తో కోకో వాండెవేగే (అమెరికా)పై గెలిచి 14 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. 2003లో ఇదే టైటిల్ కోసం విలియమ్స్ సిస్టర్స్ మధ్య జరిగిన ఫైనల్లో సెరెనా నెగ్గింది. ఓవరాల్‌గా వీరిద్దరు 27 సార్లు తలపడగా 16–11తో సెరెనా ఆధిక్యంలో ఉంది. 2008లో వీనస్ చివరిసారిగా గ్రాండ్ స్లామ్ (వింబుల్డన్) టైటిల్ నెగ్గింది.
నేటి పురుషుల సెమీఫైనల్
నాదల్(vs)దిమిత్రోవ్
సోనీ సిక్స్‌లో మ. 2 గం. నుంచి ప్రత్యక్ష ప్రసారం