
మయామి: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఖాతాలో మరో మాస్టర్స్ టైటిల్ చేరింది. 37 ఏళ్ల ఫెడరర్ నాలుగోసారి మయామి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6–1, 6–4 స్కోరుతో డిఫెండింగ్ చాంపియన్ జాన్ ఇస్నర్ (అమెరికా)ను చిత్తు చేశాడు. తన 50వ మాస్టర్స్ టోర్నీ ఫైనల్ ఆడిన ఫెడరర్... 63 నిమిషాల్లో ప్రత్యర్థి ఆట కట్టించాడు. రోజర్ కెరీర్‌లో ఇది 28వ మాస్టర్స్ టైటిల్ కాగా, ఓవరాల్‌గా 101వ ఏటీపీ టైటిల్ కావడం విశేషం.
నాలుగో ర్యాంకుకు ఫెడరర్
పారిస్: మయామి మాస్టర్స్ సిరీస్–1000 టైటిల్ నెగ్గిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్... ఏటీపీ ర్యాంకింగ్స్‌లోనూ తన స్థానాన్ని మెరుగు పరుచుకున్నాడు. సోమవారం ఏటీపీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఫెడరర్ ఒక స్థానం ఎగబాకి నాలుగో ర్యాంకులో నిలిచాడు. దీంతో డొమినిక్ థీమ్ ఐదో స్థానానికి పడిపోయాడు. మరోవైపు సెర్బియా స్టార్ నోవాక్ జొకోవిచ్ (11070 పాయింట్లు) అగ్రస్థానం పదిలంగా ఉండగా... రాఫెల్ నాదల్ (స్పెయిన్, 8725 పాయింట్లు), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ, 6040 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment