టెన్నిస్‌లో నిలకడగా రాణిస్తున్న తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్
ఉన్నత విద్యనభ్యసిస్తూనే ప్రొఫెషనల్‌గా మారిన వైనం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ
అంతర్జాతీయ స్థాయిలో మరో యువ టెన్నిస్ ఆటగాడు దూసుకొస్తున్నాడు. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు సంతతి కుర్రాడు నిశేష్ బసవరెడ్డి... గత సీజన్‌లో అనూహ్య ప్రదర్శనతో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) యూత్ చాలెంజర్స్ టూర్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధించడంతో పాటు... సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు వైల్డ్ కార్డు ఎంట్రీ పొందాడు. కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన 19 ఏళ్ల నిశేష్ బసవరెడ్డి డిసెంబర్‌లోనే ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారాడు.
457వ ర్యాంక్‌తో 2024వ సంవత్సరం టెన్నిస్ సీజన్‌ను ప్రారంభించిన నిశేష్... వరుస విజయాలతో సత్తా చాటి సీజన్ ముగిసేసరికి ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 138వ స్థానానికి చేరాడు. చాలెంజర్ టూర్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నిశేష్ ఈ మధ్యకాలంలో 6 టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రెండింట టైటిల్ చేజిక్కించుకున్నాడు. దీంతో అతడికి ఆ్రస్టేలియా ఓపెన్‌లో బరిలోకి దిగే అవకాశం దక్కింది. ఆదివారం నుంచి మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభం కానున్న గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నిశేష్ బరిలోకి దిగనున్నాడు.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో డాటా సైన్సెస్ అభ్యసించిన నిశేష్ కుటుంబం నెల్లూరు నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడింది. నెల్లూరుకు చెందిన నిశేష్ తండ్రి మురళీ రెడ్డి టెక్ పరిశ్రమలో పని చేస్తుండగా... సోదరుడు నిశాంత్ రెడ్డి ఐటీ కంపెనీలో ఉద్యోగి. తల్లి సాయి ప్రసన్న గృహిణి. చిన్నప్పుడు చాలాసార్లు భారత్‌కు వచ్చి వెళ్లిన నిశేష్‌కు హైదరాబాద్, నెల్లూరులో బంధువులు ఉన్నారు. చుట్టాలు, స్నేహితుల వల్ల తెలుగుపై అవగాహన పెంచుకున్న నిశేష్ స్పష్టంగా మాట్లాడలేకపోయినా సినిమాలు మాత్రం బాగా చూస్తాడు.
సబ్ టైటిల్స్ లేకుండా భాషను అర్థం చేసుకుంటాడు. ఒలింపిక్ పతక విజేత రాజీవ్ రామ్ వద్ద శిక్షణ పొందుతున్న నిశేష్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు. ‘17 ఏళ్ల వయసులోనే పట్టభద్రుడిగా మారాను. చాలా అంశాలపై ఆసక్తి ఉంది. అందుకే వాటిలో మరింత మెరుగవ్వాలని నిర్ణయించుకున్నా. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. చిన్నప్పుడు తరచూ గాయపడే వాడిని. పాఠశాల విద్య పూర్తవగానే ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారాలని అనుకోలేదు. కానీ అలా జరిగిపోయిందంతే.
చిన్నప్పటి నుంచి టెన్నిస్ అంటే విపరీతమైన ఇష్టం. టీవీలో ఎప్పుడూ టెన్నిస్ చానల్ చూస్తూ ఉండేవాడిని. కామెంటేటర్‌లు చెప్పే మాటలు వింటూ ప్లేయర్ల లాగా షాట్లు ఆడేందుకు ప్రయత్నించేవాడిని. దేన్నైనా నిశితంగా పరిశీలించడం నాకు అలవాటు. దీనివల్లే ప్రత్యర్థి ఆటగాళ్ల తప్పులను గమనించి అందుకు తగ్గట్లు వ్యూహాలు రచించుకోవడం నేర్చుకున్నా. ఇది అంత సులువుగా సాధ్యం కాలేదు. నిరంతర సాధన వల్ల వచ్చిoది’ అని తాజా
ర్యాంకింగ్స్‌లో 133వ ర్యాంక్‌లో ఉన్న నిశేష్ అన్నాడు. –సాక్షి క్రీడా విభాగం
ఆక్లాండ్ ఓపెన్‌లో శుభారంభం
ఈ ఏడాది ఆడుతున్న రెండో ఏటీపీ–250 టోర్నీలో నిశేష్ బసవరెడ్డి శుభారంభం చేశాడు. న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఆక్లాండ్ ఓపెన్ టోర్నీలో నిశేష్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. క్వాలిఫయింగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో క్వాలిఫయర్‌గా అడుగు పెట్టిన నిశేష్ తొలి రౌండ్‌లో 6–2, 6–2తో ప్రపంచ 85వ ర్యాంకర్ ఫ్రాన్సిస్కో కమ్సానా (అర్జెంటీనా)పై గెలుపొందాడు.
69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిశేష్ ఆరు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయని నిశేష్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. గతవారం బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలోనూ క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో ఆడిన నిశేష్ తొలి రౌండ్‌లో ఫ్రాన్స్ సీనియర్ స్టార్ ప్లేయర్ గేల్ మోన్‌ఫిల్స్ చేతిలో మూడు సెట్‌లపాటు పోరాడి ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment