బెంగళూరు:ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నాల్గో వన్డే పలువురు ఆటగాళ్లకు మధుర జ్ఞాపకాల్ని తీసుకొచ్చింది. తన కెరీర్ లో వందో వన్డే ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ శతకం సాధించడం ఒకటైతే, ఆసీస్ జట్టుపై వన్డేల్లో 50 సిక్సర్లు బాదిన ఏకైక బ్యాట్స్ మన్ గా భారత ఓపెనర్ రోహిత్ గుర్తింపు సాధించడం మరొకటి.
నిన్నటి మ్యాచ్ లో రెండు సిక్సర్లను కొట్టిన అనంతరం ఆస్ట్రేలియాపై వన్డే ఫార్మాట్ లో 50 సిక్సర్లు సాధించిన ఘనతను నమోదు చేసుకున్నాడు. వన్డేల్లో రోహిత్ శర్మ ఒక్కడే ఆసీస్ పై 50 సిక్సర్లు కొట్టిన క్రికెటర్. ఆ తరువాత రెండో స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(39 వన్డే సిక్సర్లు) ఉన్నాడు.
ఓవరాల్ గా ఆసీస్ పై నాల్గో వన్డేలో రోహిత్ శర్మ(65) పరుగులు సాధించాడు. ఇందులో 1 ఫోర్ మాత్రమే ఉండగా, ఐదు సిక్సర్లను రోహిత్ బాదాడు. ప్రస్తుతం ఆసీస్ పై వన్డేల్లో 53 సిక్సర్లతో రోహిత్ ఎవ్వరికీ అందనంత దూరంలో ఉన్నాడు.
అంతముందు ఆసీస్ తో జరిగిన మూడో వన్డే ద్వారా రోహిత్ అరుదైన ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో బాదిన నాలుగు సిక్సర్లతో అన్ని ఫార్మాట్లలో కలిపి ఆ జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. దీనిలో భాగంగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ (61 సిక్సర్లు)ను రోహిత్ (65 సిక్సర్లు) గత మ్యాచ్ ద్వారా అధిగమించాడు. ప్రస్తుతానికి ఆసీస్ పై అన్ని ఫార్మాట్లలో రోహిత్ కొట్టిన సిక్సర్లు 70. ఇక్కడ సచిన్ టెండూల్కర్ 60 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
2013 నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా రోహిత్ నిలిచాడు. ఈ నాలుగేళ్లలో ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్ లో 80 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ 118 సిక్సర్లు బాదాడు. ఈ ఫార్మాట్లో దక్షిణాఫ్రికా విధ్వంసకర క్రికెటర్ ఏబీ డివిలియర్స్ 106 సిక్సర్ల (86 ఇన్నింగ్స్‌లు)తో రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 95 ఇన్నింగ్స్‌ల్లో 100 సిక్సర్లు బాదాడు. ఓవరాల్‌గా ఈ నాలుగేళ్ల వ్యవధిలో అన్ని ఫార్మాట్లలో కలిపి 144 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్‌శర్మ 174 సిక్సర్లు సాధించగా, ఇక్కడ కూడా దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్ 153 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు.
ఓవరాల్ గా మూడో బ్యాట్స్ మన్..
ఒక ప్రత్యర్థి జట్టుపై వన్డే ఫార్మాట్ లో యాభైకి పైగా సిక్సర్లు కొట్టిన మూడో బ్యాట్స్ మన్ గా రోహిత్ శర్మ గుర్తింపు సాధించాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది, శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య లు ఉన్నారు. భారత్ పై ఆఫ్రిది 50 కు పైగా సిక్సర్లు సాధించగా, పాకిస్తాన్ పై జయసూర్య ఆ ఫీట్ ను నమోదు చేశాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో 50కి పైగా సిక్సర్లు సాధించిన రోహిత్ శర్మ వారి సరసన చేరాడు.