
కోహ్లీ ఔట్: మలింగకు రోహిత్ కంగ్రాట్స్
కొలంబో: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 76 బంతుల్లో మెరుపు శతకం సాధించాడు. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో లంక కెప్టెన్ లసిత్ మలింగ చేతికి కోహ్లీ చిక్కాడు. అయితే కోహ్లీని మలింగ ఔట్ చేయగానే భారత ఓపెనర్ రోహిత్ శర్మ, మలింగ వద్దకు వచ్చి కౌగిలించుకుని అభినందించాడు. అదేంటని అశ్చర్యపోతున్నారా.. నేటి మ్యాచ్‌లో మలింగ, కోహ్లీని ఔట్ చేయగానే లంక కెప్టెన్ ఖాతాలో 300వ వన్డే వికెట్ చేరింది. తద్వారా అతి తక్కువ వన్డేల్లో ఈ ఫీట్ నమోదు చేసిన బౌలర్లలో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం.
మలింగ వేసిన 30వ ఓవర్లో మూడో బంతిని కోహ్లీ స్వీపర్ కవర్ వైపుగా భారీ షాట్ ఆడగా అదే స్థానంలో ఉన్న మునవీర ఏ ఇబ్బంది లేకుండా క్యాచ్ పట్టాడు. దీంతో సెంచరీ హీరో కోహ్లీ (131: 96 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లు) పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం సెంచరీ సాధించిన రోహిత్ శర్మ (104: 88 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు)ను ఏంజెలో మాథ్యూస్ ఔట్ చేశాడు. వరుసగా రెండు వన్డేల్లో శతకాలతో రోహిత్ ఫామ్ కొనసాగిస్తున్నాడు.