
ముంబై: మహమ్మారి ‘కోవిడ్–19’పై పోరు కోసం క్రీడా లోకం తరలివస్తోంది. విరాళాల రూపంలో క్రీడాకారులు కరోనా కట్టడికి తమకు సాధ్యమైనంత సహాయ సహకారాల్ని అందజేస్తున్నారు. భారత క్రికెట్ వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం రూ. 80 లక్షల విరాళం ప్రకటించాడు. పీఎం–కేర్స్ నిధికి రూ. 45 లక్షలు, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, ‘జొమాటో ఫీడింగ్ ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 5 లక్షలు, వీధి శునకాల సంక్షేమం కోసం రూ. 5 లక్షలు కేటా యించినట్లు రోహిత్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. భారత మాజీ కెప్టెన్, కోచ్, దిగ్గజ లెగ్‌స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా ప్రధానమంత్రి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళమిచ్చాడు. అయితే ఇచ్చిన మొత్తాన్ని మాత్రం వెల్లడించలేదు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా రూ.3 లక్షలు కేంద్రం, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాల కోసం కేటాయించాడు. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య పీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 5 లక్షలు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment