న్యూఢిల్లీ: సారథ్యం వహించే అవకాశం వచ్చినపుడల్లా దాన్ని ఆస్వాదిస్తానని... అయితే కెప్టెన్సీ గురించే ఎక్కువగా ఆలోచించనని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లికి పొట్టి ఫార్మాట్‌లో విశ్రాంతి ఇవ్వడంతో స్టార్ ఓపెనర్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. బంగ్లాతో టి20ల కోసం పగ్గాలు చేపట్టిన ఈ ఓపెనర్ ఇది ముణ్నాళ్ల ముచ్చటైనా... తనకెలాంటి బాధలేదని చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మకు టీమిండియా పగ్గాలు అప్పగించాలని చాన్నాళ్లుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో తనను లాగొద్దని... జట్టుకు అవసరమైన ప్రతీసారి నాయకత్వం వహించేందుకు సిద్ధమేనన్నాడు. మీడియాతో రోహిత్ మాట్లాడుతూ ‘కెప్టెన్సీ అనేది మన చేతుల్లో ఉండదు. కెప్టెన్‌గా ఒక మ్యాచ్ అయినా వంద మ్యాచ్‌లయినా... అదో గౌరవం. ఆట నేర్చుకునేటపుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకుంటాం. నేను కెప్టెన్‌గా ఇంతకుముందు వ్యవహరించాను. ఆ అనుభవాన్ని అస్వాదిస్తున్నాను. ఇది ఎన్నాళ్లుంటుందోనన్న బెంగలేదు. కొన్నాళ్లే అన్న బాధ లేదు’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment