సిగ్గు...సిగ్గు...
తొలి వన్డేలో చేజేతులా ఓడిన భారత్
► 5 పరుగులతో నెగ్గిన దక్షిణాఫ్రికా
► రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ వృథా
► డివిలియర్స్ మెరుపు సెంచరీ
► రెండో వన్డే బుధవారం
భారత్ ఎదురుగా 304 పరుగుల కొండంత లక్ష్యం.... అయినా రోహిత్‌శర్మ ఏ మాత్రం బెదరకుండా దాదాపు సగం పరుగులు ఒక్కడే చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడితో ఏకంగా 150 పరుగులు చేసి విజయపు అంచుల్లోకి తీసుకొచ్చాడు. ఇక భారత్ 24 బంతుల్లో 35 పరుగులు చేస్తే చాలు. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో దక్షిణాఫ్రికా గెలుస్తుందనే ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. కానీ అనిశ్చితికి మారుపేరైన భారత ‘హీరో’లు తోక ముడిచారు. అనుభవం లేని రబడా బంతుల్ని ఎదుర్కోలేక... క్రీజులో నిలబడటానికే తడబడి... చేజేతులా ఓడిపోయారు. ఆఖరి ఓవర్ వరకు పోరాట స్ఫూర్తితో ఆడిన దక్షిణాఫ్రికా జట్టు తొలి వన్డేలో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేసింది.
కాన్పూర్: జట్టులో ధోని ఎందుకంటూ ఓ వైపు ప్రశ్నల వర్షం కురుస్తున్నా... ప్రపంచంలో ఇప్పటికీ తనే బెస్ట్ ఫినిషర్ అనే నమ్మకం మాత్రం అందరిలోనూ ఉంది. చివరి ఓవర్లో మెరుపు షాట్లతో మ్యాచ్‌లను అలవోకగా ముగించే ధోని... ఈసారి మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికాపై కచ్చితంగా గెలిచే స్థితిలో ఉన్న మ్యాచ్‌ను కాపాడలేకపోయాడు. కోహ్లి, రైనా, బిన్నీ కూడా పూర్తిగా బాధ్యతారాహిత్యం కనబరిచారు. ఫలితం... తొలి వన్డేలో భారత్‌కు ఓటమి. రోహిత్ శర్మ (133 బంతుల్లో 150; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడినా ఉపయోగం లేకపోయింది.
గ్రీన్‌పార్క్ మైదానంలో ఆదివారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 5 పరుగుల స్వల్ప తేడాతో భారత్‌పై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్లకు 303 పరుగులు చేసింది. కెప్టెన్ డివిలియర్స్ (73 బంతుల్లో 104 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడగా.. డు ఫ్లెసిస్ (77 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. తర్వాత భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులకే పరిమితమైంది. రోహిత్‌కు తోడు రహానే (82 బంతుల్లో 60; 5 ఫోర్లు) రాణించాడు. ఐదు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే బుధవారం ఇండోర్‌లో జరుగుతుంది.
కళ్లు చెదిరే షాట్లు
దక్షిణాఫ్రికా ఓపెనర్లలో డికాక్ (29) తొందరగా అవుటైనా... ఆమ్లా (37) నిలకడగా ఆడాడు. పేసర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో తొమ్మిదో ఓవర్‌లోనే ధోని... అశ్విన్ చేతికి బంతి ఇచ్చి ఫలితాన్ని సాధించాడు. వన్‌డౌన్‌లో డు ఫ్లెసిస్ మెరుగ్గా ఆడినా... పార్ట్‌టైమర్ రైనా చక్కని బౌలింగ్‌తో పరుగులు నిరోధించాడు. రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించాక ఆమ్లా వెనుదిరిగాడు. ఈ దశలో వచ్చిన డివియర్స్ కళ్లు చెదిరే షాట్లతో చెలరేగిపోయాడు. రెండో ఎండ్‌లో డు ఫ్లెసిస్, మిల్లర్ (13), డుమిని (15) వరుస విరామాల్లో అవుటైనా... 40వ ఓవర్ తర్వాత డివిలియర్స్ మాత్రం శివాలెత్తాడు. బిన్నీ వేసిన 45వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 21 పరుగులు; భువీ (49వ ఓవర్) ఓవర్లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు రాబట్టాడు. రెండో ఎండ్‌లో బెహర్డీన్ (35 నాటౌట్) కూడా చెలరేగడంతో సఫారీల స్కోరు 300లు ధాటింది. ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి సెంచరీ పూర్తి చేసిన డివిలియర్స్... బెహర్డీన్‌తో కలిసి 4.5 ఓవర్లలో అజేయంగా 65 పరుగులు సమకూర్చాడు. ఉమేశ్, మిశ్రా చెరో రెండు వికెట్లు తీశారు.
రోహిత్ ఒంటరిపోరాటం
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధావన్ (23) విఫలమైనా.. రోహిత్ అద్భుతంగా ఆడాడు. సఫారీ బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా షాట్లు కొట్టాడు. రెండో ఎండ్‌లో రహానే కూడా సమయోచితంగా ఆడటంతో భారత్ ఇన్నింగ్స్ ఇబ్బంది లేకుండా సాగింది. అయితే అర్ధసెంచరీ పూర్తయిన తర్వాత రహానే భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 34వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన కోహ్లి (11) స్ట్రయిక్ రొటేట్ చేయడంలో, పరుగులు తీయడంలో విఫలమయ్యాడు. 98 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్... ధోనితో కలిసి వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఎక్కువగా స్ట్రయిక్ తీసుకొని భారీ సిక్సర్లు కొట్టడంతో స్కోరు పరుగెత్తింది. నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించాక 47వ ఓవర్‌లో రోహిత్, రైనాలు నాలుగు బంతుల వ్యవధిలో అవుట్‌కావడం భారత్‌ను దెబ్బతీసింది. చివరి ఓవర్లో భారత్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా... రబడా వేసిన ఈ ఓవర్లో ధోని, బిన్నీ అవుటయ్యారు. దీంతో కేవలం ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) రైనా (బి) అశ్విన్ 29; ఆమ్లా (బి) మిశ్రా 37; డు ఫ్లెసిస్ ఎల్బీడబ్ల్యు (బి) ఉమేశ్ 62; డివిలియర్స్ నాటౌట్ 104; మిల్లర్ (స్టంప్డ్) ధోని (బి) మిశ్రా 13; డుమిని (సి) ధోని (బి) ఉమేశ్ 15; బెహర్డీన్ నాటౌట్ 35; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (50 ఓవర్లలో 5 వికెట్లకు) 303.
వికెట్ల పతనం: 1-45; 2-104; 3-152; 4-197; 5-238.
బౌలింగ్: భువనేశ్వర్ 10-0-67-0; ఉమేశ్ 10-0-71-2; అశ్విన్ 4.4-0-14-1; మిశ్రా 10-0-47-2; బిన్నీ 8-0-63-0; రైనా 7-0-37-0; కోహ్లి 0.2-0-1-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) తాహిర్ 150; ధావన్ ఎల్బీడబ్ల్యు (బి) మోర్కెల్ 23; రహానే (సి) మిల్లర్ (బి) బెహర్డీన్ 60; కోహ్లి (సి) మోర్కెల్ (బి) స్టెయిన్ 11; ధోని (సి అండ్ బి) రబడా 31; రైనా (సి) డుమిని (బి) తాహిర్ 3; బిన్నీ (సి) ఆమ్లా (బి) రబడా 2; భువనేశ్వర్ నాటౌట్ 1; మిశ్రా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 298.
వికెట్ల పతనం: 1-42; 2-191; 3-214; 4-269; 5-273; 6-297; 7-297.
బౌలింగ్: స్టెయిన్ 10-0-54-1; రబడా 10-0-58-2; బెహర్డీన్ 6-0-38-1; మోర్కెల్ 10-0-51-1; డుమిని 4-0-36-0; తాహిర్ 10-0-57-2.
‘అశ్విన్ గాయపడటం మమ్మల్ని బాగా దెబ్బతీసింది. అతను వేయని 5.2 ఓవర్లే చాలా కీలకమయ్యాయి. భారీ లక్ష్యం ఉన్నా గెలుపునకు చాలా దగ్గరగా వచ్చాం. కానీ ఫలితమే నిరాశపర్చింది. బిన్నీ, రైనాలకు మరిన్ని ఓవర్లు వేసే అవకాశం ఇవ్వాల్సింది. ఓవరాల్‌గా మా బౌలర్లు కాస్త మెరుగుపడ్డారనే చెప్పొచ్చు. రోహిత్, రహానే భాగస్వామ్యం అద్భుతం. మధ్యలో కొన్ని ఓవర్లు స్ట్రయిక్ రొటేట్ కాలేదు. ఇది మా విజయాన్ని దెబ్బతీసింది. చివర్లో బంతి అనుకున్నంత ఎత్తులో రాలేదు. దీంతో భారీ షాట్లు కొట్టడంలో విఫలమయ్యాం’. -ధోని
‘ఈ గెలుపు మొత్తం తాహిర్‌దే. ఒకే ఓవర్‌లో రోహిత్, రైనా వికెట్లు తీయడం మాకు కలిసొచ్చింది. ఇలాంటి మ్యాచ్‌లే అభిమానులను స్టేడియానికి తీసుకొస్తాయి. మ్యాచ్ మధ్యలో చాలాసార్లు విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. అయితే తాహిర్ మా వైపు మొగ్గేలా చేశాడు. చివర్లో రబడా బాగా నిలువరించాడు. కొంత విశ్రాంతి తీసుకొని రెండో మ్యాచ్‌పై దృష్టిపెడతాం’. - డివిలియర్స్