దుమ్మురేపిన రోస్‌బర్గ్
స్పీల్‌బెర్గ్: అందివచ్చిన ఏకైక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్‌లో మూడో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి రేసులో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 30 నిమిషాల 16.930 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ తొలి మలుపు వద్ద లూయిస్ హామిల్టన్‌ను ఓవర్‌టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత రోస్‌బర్గ్ వెనుదిరిగి చూడలేదు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ తొలి ల్యాప్‌లోనే వెనుకబడిపోవడంతో మళ్లీ తేరుకోలేకపోయాడు.
పిట్ స్టాప్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో హామిల్టన్‌పై ఐదు సెకన్ల పెనాల్టీ కూడా విధించారు. విలియమ్స్ జట్టు డ్రైవర్ ఫెలిప్ మసా మూడో స్థానాన్ని దక్కించుకోగా... సెబాస్టియన్ వెటెల్ నాలుగో స్థానాన్ని పొందాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానాన్ని సాధించగా... పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. తొలి ల్యాప్‌లో రైకోనెన్ (ఫెరారీ), అలోన్సో (మెక్‌లారన్) కార్లు పరస్పరం ఢీకొట్టుకొని రేసు నుంచి వైదొలగగా... ఆ తర్వాత మరో నలుగురు డ్రైవర్లు సాంకేతిక కారణాలతో తప్పుకున్నారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు బ్రిటన్ గ్రాండ్‌ప్రి జులై 5న జరుగుతుంది.
వర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5)
స్థానం డ్రైవర్ జట్టు పాయింట్లు
1 హామిల్టన్ మెర్సిడెస్ 169
2 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 159
3 వెటెల్ ఫెరారీ 120
4 రైకోనెన్ ఫెరారీ 72
5 బొటాస్ విలియమ్స్ 67
కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5)
స్థానం జట్టు పాయింట్లు
1 మెర్సిడెస్ 328
2 ఫెరారీ 192
3 విలియమ్స్ 129
4 రెడ్‌బుల్ 55
5 ఫోర్స్ ఇండియా 31