న్యూఢిల్లీ : టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'నా మీద కేవలం బీసీసీఐ నిషేధం విదించింది.. కానీ ఐసీసీ కాదుగా' అందుకే భారత్‌లో ఆడే అవకాశం ఇవ్వకపోతే వేరే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవల చెప్పిన శ్రీశాంత్.. ఫిక్సింగ్ కు సంబంధించిన పలు అంశాలను వెల్లడించినట్లు సమాచారం. 'ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్ లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్‌తో సంబంధం ఉంది. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించింది. కొందరు క్రికెటర్లపై ఢిల్లీ పోలీసులు ఇది వరకే కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలుసు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే ఫిక్సింగ్‌కు పాల్పడిన అందరి పేర్లు బయటకొస్తాయని' శ్రీశాంత్ వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్, ఇతర ట్రోఫీలలో ఫిక్సింగ్ కు పాల్పడిన క్రికెటర్లు ఇప్పటీకి ఆడుతున్నారని శ్రీశాంత్ అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముద్గల్ రిపోర్టులో ఆ క్రికెటర్ల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇటీవల కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పును బీసీసీఐ ఉన్నత ధర్మాసనం ముందు సవాల్ చేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో దొరికిపోయిన పేసర్ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయడం సరికాదని బీసీసీఐ వాదనలు వినిపించింది. 2013 జూలైలో ఐపీఎల్-6 సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది.
Comments
Please login to add a commentAdd a comment