spot fixing case
-
కర్ణాటక లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్!
సాక్షి, బెంగళూరు: గత కొంత కాలంగా ఫిక్సింగ్‌కు కేంద్రంగా మారిందని భావిస్తున్న కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్)లో మరో కొత్త వివాదం బయటకు వచ్చింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఇద్దరు కర్ణాటక క్రికెటర్లను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరిలో ఒకరు చిదంబరం మురళీధరన్ (సీఎం) గౌతమ్ కాగా, మరొకరు అబ్రార్ కాజీగా వెల్లడైంది. ఈ ఏడాది జరిగిన కేపీఎల్ ఫైనల్లోనే వీరిద్దరు స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. హుబ్లీ టైగర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు బెళ్లారి టస్కర్స్‌కు గౌతమ్ కెప్టెన్ కాగా... కాజీ సభ్యుడు. చివరకు ఈ మ్యాచ్‌లో టస్కర్స్ 8 పరుగులతో ఓడింది. నెమ్మదిగా బ్యాటింగ్ చేసేందుకు వీరిద్దరు రూ. 20 లక్షలు తీసుకున్నారు. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో కూడా గౌతమ్, కాజీ ఫిక్సింగ్ పాల్పడినట్లు తేలింది. గౌతమ్ ఘనమైన రికార్డు ఫిక్సింగ్‌కు పాల్పడి అరెస్టయిన క్రికెటర్లలో సీఎం గౌతమ్‌కు ఆటగాడిగా మంచి గుర్తింపు ఉంది. 33 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గౌతమ్ 11 ఏళ్ల కెరీర్లో 94 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 41.36 సగటుతో అతను 4716 పరుగులు చేశాడు. 9 సీజన్ల పాటు కర్ణాటకకు ఆడిన అతను ఆ జట్టు 2013–15 మధ్య వరుసగా రెండు సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ కాలం వైస్‌కెప్టెన్‌గా ఉన్న గౌతమ్... వినయ్ కుమార్ గైర్హాజరులో జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతను నాయకత్వం వహించిన టీమ్‌లో ఉతప్ప, కేఎల్ రాహుల్, మయాంక్, మనీశ్ పాండేలాంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇండియా ‘ఎ’ తరఫున కూడా ఆడిన గౌతమ్... ఐపీఎల్లో ఆర్సీబీ, ముంబై, ఢిల్లీ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది గోవా జట్టుకు మారగా, ఇప్పుడు అతని కాంట్రాక్ట్ రద్దయింది. కర్ణాటక తరఫున 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అబ్రార్‌కు గౌతమ్‌తో సాన్నిహిత్యం ఉంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. -
శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ : టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'నా మీద కేవలం బీసీసీఐ నిషేధం విదించింది.. కానీ ఐసీసీ కాదుగా' అందుకే భారత్‌లో ఆడే అవకాశం ఇవ్వకపోతే వేరే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవల చెప్పిన శ్రీశాంత్.. ఫిక్సింగ్ కు సంబంధించిన పలు అంశాలను వెల్లడించినట్లు సమాచారం. 'ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్ లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్‌తో సంబంధం ఉంది. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించింది. కొందరు క్రికెటర్లపై ఢిల్లీ పోలీసులు ఇది వరకే కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలుసు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే ఫిక్సింగ్‌కు పాల్పడిన అందరి పేర్లు బయటకొస్తాయని' శ్రీశాంత్ వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్, ఇతర ట్రోఫీలలో ఫిక్సింగ్ కు పాల్పడిన క్రికెటర్లు ఇప్పటీకి ఆడుతున్నారని శ్రీశాంత్ అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముద్గల్ రిపోర్టులో ఆ క్రికెటర్ల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇటీవల కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పును బీసీసీఐ ఉన్నత ధర్మాసనం ముందు సవాల్ చేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో దొరికిపోయిన పేసర్ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయడం సరికాదని బీసీసీఐ వాదనలు వినిపించింది. 2013 జూలైలో ఐపీఎల్-6 సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. -
ఊరట.. ఇంతలోనే భారీ షాక్!
సాక్షి, కొచ్చి: క్రికెటర్ ఎస్ శ్రీశాంత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని పునరుద్ధరిస్తూ.. కేరళ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు వెలువరించింది. శ్రీశాంత్‌పై భారత క్రికెట్ సంఘం (బీసీసీఐ) విధించిన జీవితకాల నిషేధాన్ని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఏకసభ్య ధర్మాసనం తీర్పును బీసీసీఐ ఉన్నత ధర్మాసనం ముందు సవాల్ చేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో దొరికిపోయిన శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయడం సరికాదని బీసీసీఐ వాదనలు వినిపించింది. 2013 జూలైలో ఐపీఎల్-6 సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. ఊరట.. ఇంతలోనే షాక్! తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అవిశ్రాంతంగా పోరాడుతున్న శ్రీశాంత్‌కు గత ఆగస్టు నెలలో ఊరట లభించింది. శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఆగస్టు 7న తీర్పునిచ్చింది. నిషేధాన్ని తొలగించాలంటూ బీసీసీఐ క్రమశిక్షణా కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. 2013లో జరిగిన ఐపీఎల్-6లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాగా.. అతనికి ఊరట లభించింది. అయితే, కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ బీసీసీఐ.. ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అతడికి వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతోనే తాము నిషేధం విధించామని పేర్కొంటూ.. గతనెల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన ఉన్నత ధర్మాసనం.. బీసీసీఐ వాదనను సమర్థిస్తూ.. అతడిపై నిషేధాన్ని పునరుద్ధరించింది. -
చండిలాపై జీవితకాల నిషేధం!
ముంబై: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో కీలక నిందితుడు, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అజిత్ చండిలాపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. గతంలో శ్రీశాంత్ తదితరులపై నిషేధం విధించిన సమయంలో చండిలాపై బోర్డు విచారణ పూర్తి కాలేదు. తాజాగా బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం హెడ్ రవి సవానీ... చండిలాను కలిసి విచారణ జరిపారు. దాదాపు మూడు గంటల పాటు ఢిల్లీలో ఈ విచారణ జరిగింది. సవానీ నివేదిక ఇవ్వగానే బోర్డు చండిలాపై నిషేధం విధించే అవకాశం ఉంది. వారం రోజుల లోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని బోర్డు వర్గాలు తెలిపాయి. -
నేను అమాయకుడిని: అంపైర్ రవూఫ్
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముంబై పోలీసుల చార్జిషీట్లో తన పేరును నమోదు చేయడాన్ని వివాదాస్పద పాక్ అంపైర్ అసద్ రవూఫ్ తప్పుపట్టారు. బుకీలతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘చర్చించడం, సమాచారాన్ని చేరవేయడం రెండు వేర్వేరు అంశాలు. వివిధ వర్గాలతో మనం చర్చించడం పరిపాటి. నా న్యాయ సలహాదారులతో సంప్రదించి పూర్తి వివరాలు వెల్లడిస్తా’ అని రవూఫ్ అన్నారు. -
పోలీసులే బలవంతంగా ఒప్పించారు: శ్రీశాంత్
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో నేరాన్ని ఒప్పుకోవాలని ఢిల్లీ పోలీసులు బలవంతం చేశారని నిషేధిత బౌలర్ శ్రీశాంత్ బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అప్పట్లో బోర్డు నియమించిన క్రమశిక్షణ కమిటీకి రాసిన ఈ లేఖలోని అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ‘నేరాన్ని అంగీకరించాల్సిందిగా పోలీసులు బలవంతపెట్టారు. పైగా నా సన్నిహితుల్ని కూడా ఇందులో ఇరికిస్తామని, అరెస్టు కూడా చేస్తామని వాళ్లు భయపెట్టారు. అలా నేను తప్పును ఒప్పుకున్నట్లుగా చెప్పించి స్టేట్మెంట్ను తయారు చేశారు. దీనిపై నా సంతకాన్ని కూడా తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు నన్ను శారీరకంగా, మానసికంగా వేధించడం వల్లే సంతకం చేయాల్సి వచ్చింది’ అని శ్రీశాంత్ లేఖలో పేర్కొన్నాడు. పోలీసుల స్టేట్మెంట్లో ఉన్నవి పూర్తిగా నిరాధారమైన అంశాలన్నాడు.