స్పెయిన్ ప్లేయర్ అస్పాస్ కిక్‌ను నిలువరిస్తున్న రష్యా గోల్ కీపర్ అకిన్‌ఫీవ్, గెలుపు సంబరంలో రష్యా ఆటగాళ్లు
78 వేల మంది ప్రేక్షకులు దిక్కులు పిక్కటిల్లేలా ఇచ్చిన మద్దతుతో సొంతగడ్డపై రష్యా గర్జించింది. ఎలాంటి అంచనాలు లేని నేపథ్యంలో బరిలోకి దిగి ఏకంగా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పెనాల్టీ షూటౌట్‌లో మాజీ చాంపియన్ స్పెయిన్‌ను చిత్తు చేసి సగర్వంగా ముందంజ వేసింది.
అద్భుత ఆటతో స్పెయిన్‌కు అడ్డు గోడలా నిలిచిన కెప్టెన్, గోల్ కీపర్ అకిన్‌ఫీవ్... ఆఖర్లో రెండు స్పాట్ కిక్‌లను ఆపి రష్యా దేశం చిరకాలం గుర్తుంచుకునే కొత్త హీరోగా అవతరించాడు.120 నిమిషాల ఆటలో రికార్డు స్థాయిలో ఏకంగా 1006 పాస్‌లు...ఆటలో 74 శాతం పాటు బంతి తమ ఆధీనంలోనే... అయినా సరే షూటౌట్ వరకు వెళ్లకుండా గెలుపు అందుకోవడం స్పెయిన్ వల్ల కాలేదు. అతి రక్షణాత్మక ధోరణి ఆడి... గోల్ చేసేందుకు ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిని వృథా చేసుకొని మూల్యం చెల్లించుకుంది.
మాస్కో: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో సంచలన ఫలితం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానంలో ఉన్న రష్యా షూటౌట్‌లో చెలరేగి వరల్డ్ నంబర్ 10 స్పెయిన్ జట్టును ఇంటిదారి పట్టించింది. ఆదివారం ఇక్కడి లుజ్నికి స్టేడియంలో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రష్యా 4–3 స్కోరు (పెనాల్టీ షూటౌట్)తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. నిర్ణీత సమయంతో పాటు మరో అర గంట అదనపు సమయం ముగిసేసరికి కూడా ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం షూటౌట్ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది.
మ్యాచ్ 12వ నిమిషంలో రష్యా ఆటగాడు సెర్గీ ఇగ్నాషెవిచ్ చేసిన సెల్ఫ్‌గోల్‌తో స్పెయిన్‌కు ఆధిక్యం లభించగా... 41వ నిమిషంలో జ్యూబా గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ కొట్టడంలో సఫలం కాలేకపోయాయి. ఈ టోర్నీలో తొలిసారి ఫలితం షూటౌట్ ద్వారా తేలగా, రష్యా 48 ఏళ్ల తర్వాత క్వార్టర్స్ చేరింది. మ్యాచ్‌లో స్పెయిన్ కొట్టిన 24 షాట్‌లను గోల్ కాకుండా నిరోధించిన కీపర్ అకిన్‌ఫీవ్ షూటౌట్‌లోనూ అదే జోరు కొనసాగించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. వరుసగా ఐదో వరల్డ్ కప్‌లో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టే నెగ్గడం విశేషం.
డిఫెన్స్...డిఫెన్స్...
రష్యా జట్టు తమ ఫుట్‌బాల్ చరిత్రలోనే ‘అతి పెద్ద’ మ్యాచ్‌లో అభిమానుల ఆశలను మోస్తూ బరిలోకి దిగింది. అయితే ఆరంభంలో 38 ఏళ్ల సీనియర్ ఆటగాడు సెర్గీ ఇగ్నాషెవిచ్ చేసిన తప్పుతో తొలి గోల్ స్పెయిన్ ఖాతాలో పడింది. రష్యా గోల్ పోస్ట్ ఎడమ వైపు నాచోను జిర్కోవ్ అడ్డుకోవడంతో స్పెయిన్‌కు ఫ్రీ కిక్ లభించింది. దీనిని అడ్డుకునే ప్రయత్నంలో ఇగ్నాషెవిచ్ తన వైపు దూసుకొస్తున్న బంతిపై దృష్టి పెట్టకుండా స్పెయిన్ స్టార్ సెర్గియో రామోస్‌ను మార్కింగ్ చేసే ప్రయత్నం చేస్తూ అతడిని పడేశాడు. ఈ క్రమంలో ఇగ్నాషెవిచ్ కాలికి తగిలిన బంతి రష్యా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిపోయింది.
ఈ టోర్నీలో రష్యాకు ఇది రెండో సెల్ఫ్ గోల్. 1966లో బల్గేరియా తర్వాత ఒకే జట్టు రెండు సెల్ఫ్ గోల్స్ ఇవ్వడం ఇదే మొదటి సారి. అయితే స్పెయిన్ తమదైన శైలిలో ‘టికీ టకా’ పాస్‌లకే కట్టుబడగా... రష్యా మాత్రం ఆ తర్వాత ధాటిని పెంచింది. 41వ నిమిషంలో రష్యా శ్రమ ఫలించింది. ఫ్రీ కిక్‌ను హెడర్ ద్వారా జ్యూబా గోల్‌గా మలిచే ప్రయత్నంలో ఉండగా, బాక్స్ ఏరియాలో గెరార్డ్ పికే చేతితో దానిని అడ్డుకున్నాడు. పికేకు ఎల్లో కార్డు ఇవ్వడంతో పాటు రిఫరీ రష్యాకు పెనాల్టీ కిక్ అవకాశం కల్పించాడు.
దీనిని జ్యూబా సునాయాసంగా గోల్‌గా మలచడంతో స్టేడియంలో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 1986 తర్వాత నాకౌట్ దశలో రష్యా చేసిన తొలి గోల్ ఇదే కావడం విశేషం. రెండో అర్ధ భాగంలో రష్యాకు కొన్ని మంచి అవకాశాలు వచ్చినా, అది చేజార్చుకుంది. కొద్దిసేపు గడిచే సరికి ఇరు జట్లు బాగా అలసిపోయినట్లు కనిపించాయి. దాంతో అంతా డిఫెన్స్ తరహా ఆటను ప్రదర్శించారు. ఒక దశలో పరిస్థితి ‘వాకింగ్ ఫుట్‌బాల్’లా కనిపించింది. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత మరో అర గంట అదనపు సమయంలో కూడా పరిస్థితి ఏమీ మారలేదు.
Comments
Please login to add a commentAdd a comment