దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారిక ట్విట్టర్ బాధ్యులెవరో కానీ ఇటీవల ఆ హ్యాండిల్ నుంచి వస్తున్న ట్వీట్‌లు పదే పదే ఐసీసీని అభాసుపాలు చేస్తున్నాయి. దీంతో పాటు అభిమానుల ఆగ్రహానికి కూడా గురవుతున్నాయి. గత నెల 15న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన అనంతరం బెన్ స్టోక్స్‌కు సచిన్ టెండూల్కర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు ఇస్తున్న ఫోటోను పెట్టి ‘ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్‌తో సచిన్’ అంటూ వ్యాఖ్య జోడించింది. అప్పుడే దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఐసీసీ మారలేదు. మరోసారి అదే ఫోటోను పెట్టి ‘అప్పుడే చెప్పాం కదా’ అంటూ కామెంట్ పెట్టింది.
దాంతో అభిమానులంతా తీవ్ర పదజాలంతో చెలరేగిపోయారు. సచిన్ పరుగులు, ప్రపంచ రికార్డులు గుర్తు చేస్తూ ఇంకా ఏమైనా చెప్పాలా అంటూ తమ అసహనాన్ని ప్రదర్శించారు. ‘ఐసీసీ చెప్పినంత మాత్రాన ఎవరూ ఆ మాటను నమ్మరు. ఆల్‌టైమ్ అత్యుత్తమ క్రికెటర్ అంటే సచిన్ మాత్రమే. మిగిలిన క్రికెట్ ప్రపంచం మొత్తం అతని తర్వాతే మొదలవుతుంది’ అని ఒక భారత అభిమాని ఘాటుగా బదులిచ్చాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆ్రస్టేలియాతో మూడోటెస్టులో స్టోక్స్ అజేయ సెంచరీతో ఇంగ్లండ్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment