ముంబై: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం నాటి చిరస్మరణీయ ఘట్టాన్ని ఎవరు మరచిపోగలరు! 2011, ఏప్రిల్ 2న కులశేఖర బౌలింగ్‌లో ధోని కొట్టిన భారీ సిక్సర్‌తో భారతావని పులకించింది. ‘ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టయిల్, ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్’... అంటూ సాగిన రవిశాస్త్రి వ్యాఖ్యానం ఇప్పటికీ మన చెవుల్లో మోగుతూనే ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా అదే రోజు అదే ముంబైలోని వాంఖడే మైదానంలో నాటి జట్టులోని కొందరు సభ్యులు దానిని గుర్తు చేసుకొని సంబరపడ్డారు. నేడు ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఇక్కడే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లలో ఉన్న క్రికెటర్లు ఇచ్చోటనే... అంటూ తమ చిరకాల స్వప్నం నెరవేరిన రోజును తలచుకున్నారు.
ముంబై మెంటార్లు సచిన్ టెండూ ల్కర్, జహీర్‌ఖాన్‌లతో యుువరాజ్ సింగ్ సెల్ఫీ దిగగా... మరో వైపు చెన్నై ఆటగాళ్లు ధోని, రైనా, హర్భజన్ కలిసి ఫోటోను పంచుకున్నారు. వరల్డ్ కప్ గెలిచిన రోజును పురస్కరించుకొని ప్రత్యేక వీడియో విడుదల చేసిన సచిన్ ప్రస్తుత జట్టు సభ్యులకు సందేశమిచ్చాడు. ‘త్వరలోనే మరో వరల్డ్ కప్ రాబోతోంది. మీలో ఎవరూ ఆడబోతున్నారో నాకు తెలీదు. కానీ ఎవరు ఆడినా గెలుపును కానుకగా తీసుకురండి. మీ జెర్సీలపై చూస్తే మూడు ప్రపంచ కప్ విజయాల స్టార్లు కనిపిస్తాయి. ఇప్పుడు ఆ సంఖ్యను నాలుగును చేయడం మీ చేతుల్లోనే ఉంది’ అని సచిన్ ఈ వీడియోలో వ్యాఖ్యానించాడు. గౌతం గంభీర్ కూడా బురదతో నిండిన తన ఫైనల్ మ్యాచ్ జెర్సీ ఫోటోను పెట్టి ‘కొన్ని జ్ఞాపకాల పుటలు మట్టితో అలంకరిస్తేనే బాగుంటుంది’ అని పోస్ట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment