ముంబై: కరోనాపై పోరులో ప్రభుత్వాలకు ఆర్థికపరంగా తన వంతు చేయూతనందించేందుకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముందుకు వచ్చాడు. ఇలాంటి విపత్కర స్థితిలో తన తరఫు నుంచి రూ. 50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు సచిన్ ప్రకటించాడు. ఇందులో రూ.25 లక్షలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో రూ. 25 లక్షలు ప్రధానమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు సచిన్ సన్నిహితుడొకరు వెల్లడించారు.
జొకోవిచ్ విరాళం రూ. 8.30 కోట్లు
వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ కూడా కోవిడ్–19 సహాయార్ధం భారీ మొత్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. తన తరఫున 10 లక్షల యూరోలు (సుమారు రూ. 8.30 కోట్లు) అందజేస్తున్నట్లు అతను ప్రకటించాడు. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం కూడా తమ తరఫున ప్రధానమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి సహాయనిధులకు చెరో రూ.21 లక్షల చొప్పున మొత్తం రూ. 42 లక్షల విరాళం ప్రకటించింది. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) కూడా రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిధికి రూ. 25 లక్షలు ఇచ్చింది. దీనికి అదనంగా ‘క్యాబ్’ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా తన తరఫు నుంచి మరో రూ. 5 లక్షలు అందజేశారు. అసోంకు చెందిన యువ స్ప్రింటర్ హిమ దాస్ తన ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆమె ఇండియన్ ఆయిల్ సంస్థలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పని చేస్తోంది.
అలీమ్ దార్ దాతృత్వం...
లాహోర్: పాకిస్తాన్‌కు చెందిన ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ అలీమ్ దార్ కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. అతనికి లాహోర్‌లో ‘దార్స్ డిలైటో’ పేరిట ఒక హోటల్ ఉంది. కరోనా కారణంగా నగరంలో ఉపాధి కోల్పోయిన పేదలకు అతను తన హోటల్ ద్వారా ఉచిత భోజనం అందిస్తున్నాడు. ఆహారం కోసం ఇబ్బందిపడుతున్నవారు ఎవరైనా, ఎపుడైనా తన హోటల్‌కు వచ్చి తినవచ్చని దార్ ప్రకటించాడు. అలీమ్ దార్ 132 టెస్టులు, 208 వన్డేలు, 46 టి20లకు అంపైర్‌గా వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment