పార్లమెంటుకు డుమ్మా కొడుతున్న 'చిన్నోడు'
క్రికెట్ ప్రపంచంలో రారాజుగా పేరొందిన డాన్ బ్రాడ్మన్ కూడా కనీసం ఒక్కసారి కలిస్తే చాలనుకున్న వ్యక్తి.. సచిన్ టెండూల్కర్. క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ మినహా దాదాపుగా ప్రపంచంలోని ప్రతి ఒక్కచోటా తనదైన ప్రతిభను కనబర్చి, ఎవరూ అందుకోలేని లెక్కలేనన్ని అద్వితీయమైన రికార్డులను ఆయన సొంతం చేసుకున్నాడు. ఆడినప్పుడే కాదు.. రిటైరైన తర్వాత కూడా సచిన్ అభిమానుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. దేశ కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగేలా చేసినందుకు గాను ప్రభుత్వం కూడా సచిన్ను గౌరవించి.. రాజ్యసభలో సభ్యత్వం ఇచ్చింది. అయితే.. రిటైరైన తర్వాత కూడా సచిన్ టెండూల్కర్ పార్లమెంటు సమావేశాలకు ఎన్నిసార్లు హాజరయ్యారంటే.. కాసేపు బుర్ర గోక్కోవాల్సిందే. ఎందుకంటే.. ఈ సంవత్సరంలో ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయినా, అత్యంత కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్నా కూడా టెండూల్కర్ ఒక్కటంటే ఒక్కసారి కూడా పార్లమెంటుకు వెళ్లిన పాపాన పోలేదు!!
2013 సంవత్సరం మొత్తమ్మీద చూసినా సచిన్ పార్లమెంటుకు వెళ్లినది కేవలం మూడంటే మూడేసార్లు. అప్పుడు కూడా సభలో జరిగిన చర్చల్లో ఏమైనా పాల్గొన్నారా అంటే.. అదీ లేదు. సర్వసాధారణంగానే భారతీయ పార్లమెంటేరియన్లలో చాలామందికి అసలు సభకు హాజరు కావడం అనే అలవాటే లేకపోయినా.. టెండూల్కర్ పరిస్థితి మాత్రం అందరికంటే మరీ దారుణంగా ఉంది. ఈ విషయాన్ని రాజ్యసభ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
గత సంవత్సరం నవంబర్ నెలలో క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో ఇక సచిన్ సభకు ఎక్కువగా వస్తారని, చర్చల్లో చురుగ్గా పాల్గొంటారని అంతా ఆశించారు. కానీ అలా ఎదురు చూసినవాళ్లందరికీ తీవ్ర నిరాశే ఎదురైంది. దీనిపై కొంతమంది విమర్శలు గుప్పించారు గానీ, ఏ ఒక్కరూ ఆయన పేరు ఎత్తే ధైర్యం మాత్రం చేయలేదు. సమాజాన్ని మారుస్తారని వీళ్లను ఎంపీలుగా చేస్తే, ఒక్కసారి కూడా సభలో కనిపించడంలేదని సమాజ్వాది పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ అన్నారు. 200 టెస్టుల్లో ఆడి 15,291 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్.. ఇక ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారో ఏమో గానీ.. పార్లమెంటుకు మాత్రం తన దర్శనభాగ్యం కల్పించడం లేదట.