లండన్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరోమారు ప్రశంసల వర్షం కురిపించాడు. తను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో సచిన్ ముందు వరుసలో ఉన్నాడని పేర్కొన్నాడు. త్వరలో రిటైర్ కాబోతున్నసచిన్ స్థానాన్ని పూడ్చటం అంత తేలిక కాదని వార్న్ తెలిపాడు. సచిన్ ఈ వారంలో ముంబైలో ఆడే చివరి టెస్టు(200) మ్యాచ్ సందర్భంగా వార్న్ కామెంటరీ చెప్పనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వార్న్ ప్రకటించాడు. ఫైనల్ టెస్ట్ మ్యాచ్ కు తొలి రెండు రోజులు తాను కామెంటేటర్ గా వ్యవరించడానికి ఆత్రుతగా ఉన్నట్లు వార్న్ తెలిపాడు.
ఈ సందర్భంగా వార్న్ తన పాత జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నాడు. సచిన్ కు ఎన్ని విధాలుగా బౌలింగ్ చేసినా అతను ఆడే తీరు ముచ్చటగొలిపేదని వార్న్ తెలిపాడు. 200 టెస్టు మ్యాచ్ లు ఆడటం,100 అంతర్జాతీయ సెంచరీలు చేయడం ఎవరికీ సాధ్యం కాని అంశమన్నాడు. ఈ టెస్టు మ్యాచ్ తో సచిన్ క్రికెట్ లో ఉన్న రికార్డులన్నీ దాదాపు తన ఖాతాలో జమ చేసుకున్నట్లేనని వార్న్ తెలిపాడు. టెస్టుల్లో, వన్డేల్లో అత్యధిక పరుగుల చేసిన వీరునిగా సచిన్ చరత్రను తిరగరాయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు.