ముంబై : క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్‌లు అభిమానులకు గుర్తుండిపోతాయనడంలో సందేహం అవసరం లేదు. మరీ అలాంటి మ్యాచ్‌లో తమ ఆరాధ్య క్రికెటర్ చెలరేగి ఆడాడంటే ఇక అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయని చెప్పొచ్చు. అలాంటి ఇన్నింగ్స్‌నే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరిగ్గా 22ఏళ్ల క్రితం(ఏప్రిల్ 22, 1998లో) షార్జా కప్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చూపించాడు. ఇప్పటివరకు సచిన్ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినా దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ మ్యాచ్‌లో సచిన్ 131 బంతుల్లో 143 పరగులు చేశాడు. ఇన్నింగ్స్‌లో మొత్తం 9ఫోర్లు ,4 సిక్సర్లు ఉన్నాయి. ('బ్రెట్ లీ బ్యాటింగ్ అంటే భయపడేవాడు')
సాధారణంగా చూస్తే ఇది మాములుగానే కనిపిస్తుంది కానీ.. జట్టును ఫైనల్ చేర్చాలన్న తపన సచిన్ ఇన్నింగ్స్‌లో స్ఫష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినా ఫైనల్‌కు చేరుకుంది. అదెలాగో తెలుసుకోవాలంటే మళ్లీ ఒకసారి ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకోవాల్సిందే. 1998 ఏప్రిల్ నెలలో కోకకోలా కప్‌ను దుబాయ్ వేదికగా షార్జాలో నిర్వహించారు. ఈ సిరీస్‌లో భారత్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా పాల్గొనగా, మ్యాచ్‌లన్నీ డే అండ్ నైట్ పద్దతిలోనే జరిగాయి. ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఏంచుకొంది.
ఆసీస్ ఆటగాడు మైఖేల్ బెవాన్ సెంచరీతో రాణించడంతో ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 284 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ కాకుండా ఇండియా ఫైనల్‌కు చేరుకోవాలంటే 46ఓవర్లలో 254 పరుగులు చేయాలి.. అయితే ఇసుకతుఫానుతో మ్యాచ్‌కు 25 నిమిషాల పాటు అంతరాయం కలగడంతో లక్ష్యాన్ని 46 ఓవర్లలో 276కు కుదించారు.ఆటకు అంతరాయం కలగడంతో 46 ఓవర్లలో 237 పరుగులు చేస్తే టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక్కడే సచిన్ టెండూల్కర్ తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఆసీస్ బౌలర్లు షేన్ వార్న్, డామియన్ ప్లెమింగ్, మైఖెల్ కాస్ప్రోవిచ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ అరవీర భయంకరంగా బ్యాటింగ్ చేశాడు. ఇన్నింగ్స్ మొత్తంలో 131 బంతులెదుర్కొన్న సచిన్ 9 ఫోర్లు , 4 సిక్స్‌ల సాయంతో 143 పరుగులు చేసి జట్టు స్కోరు 242 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఒకదశలో సచిన్ బ్యాటింగ్ ముందు లక్ష్యం చాలా చిన్నదిగా అనిపించింది. అయితే సచిన్ ఓటయ్యాక ఒత్తిడికి తలొగ్గిన భారత్ 46 ఓవర్లలో 250 పరుగులు చేసింది.(' స్వీట్‌హార్ట్.. డిన్నర్ ఎక్కడ చేద్దాం')
అయితే ఫైనల్‌కు చేరుకోవాలంటే చేయాల్సిన పరుగులు అప్పటికే పూర్తి చేయడంతో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ మరోసారి సెంచరీతో మెరవడంతో భారత జట్టు కోకకోలా కప్ను ఎగరేసుకపోయింది. ప్లేయర్ ఆఫ్ ది సరీస్‌గా సచిన్ నిలవడం విశేషం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. సచిన్ వల్ల తనకు నిద్రలేని రాత్రులు గడిచాయని ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ ఈ సిరీస్ తర్వాత పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment