
సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బౌలర్ల వైఫల్యంతో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు అప్పగించేసింది. బ్యాట్స్‌మన్ సమిష్టి ఆటతీరు బాగానే ఉన్నా.. బౌలింగ్ కూర్పు సమస్యగా మారింది. యార్కర్ల కింగ్ నటరాజన్‌కు అవకాశం ఇవ్వకుండా సైనీని ఆడించడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. కేవలం బౌలర్ల వైఫల్యం కారణాలే టీమిండియా సిరీస్ ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు. (చదవండి : ఆఫ్ఘన్ బౌలర్‌పై ఆఫ్రిది తిట్ల పురాణం)
ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో వన్డేలో మరో 23 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా కోహ్లి నిలుస్తాడు. ఈ క్రమంలో కోహ్లి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. సచిన్‌కు ఈ ఘనతను అందుకోవడానికి 309 మ్యాచ్‌ల్లో 300 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. కానీ కోహ్లి ఆ 23 పరుగులు చేస్తే 242వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత అందుకున్న ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు.
ఇక మొత్తంగా చూసుకుంటే వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన వారిలో కోహ్లి ఆరో ప్లేయర్‌గా నిలవనున్నాడు. ఇంతకు ముందు సచిన్‌తోపాటు రికీ పాంటింగ్, కుమార సంగక్కర, సనత్ జయసూర్య, మహేల జయవర్దనె కూడా వన్డేల్లో 12 వేల పరుగులు సాధించిన జాబితాలో ఉన్నారు. అంతేగాక కోహ్లి ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా సచిన్ (9 సెంచరీలు) సరసన నిలవనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment