సచిన్‌ వల్ల షేన్‌ వార్న్‌కు నిద్రలేని రాత్రులు.. | Shane Warne-Sachin Tendulkar Rivalry Evergreen In Cricket Game | Sakshi
Sakshi News home page

Shane Warne-Sachin: 'చిన్న వయసులోనే వెళ్లిపోయావా మిత్రమా'.. సచిన్‌ భావోద్వేగం

Published Fri, Mar 4 2022 10:50 PM | Last Updated on Sat, Mar 5 2022 8:52 AM

Shane Warne-Sachin Tendulkar Rivalry Evergreen In Cricket Game - Sakshi

 'చిన్న వయసులోనే వెళ్లిపోయావా మిత్రమా'.. సచిన్‌ భావోద్వేగం

ఆటలో ఇద్దరు దిగ్గజాలు తలపడితే ఆ మజా వేరుగా ఉంటుంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎదురుపడిన ప్రతీసారి ఒక్కరే ఆధిపత్యం ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది. అచ్చం అలాంటిదే షేన్‌ వార్న్‌.. భారత్‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వల్ల ఎదుర్కొన్నాడు. తన బౌలింగ్‌తో ఎందరో మేటి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన వార్న్‌కు సచిన్‌ మాత్రం కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.

 

అంతర్జాతీయ క్రికెట్‌లో వార్న్‌- సచిన్‌లు 29 సార్లు ముఖాముఖి తలపడితే.. అందులో కేవలం నాలుగుసార్లు మాత్రమే సచిన్‌ని వార్న్ ఔట్ చేయడం విశేషం.టెస్టు సిరీస్ ల సందర్బంగా..  చెన్నై (1998), కాన్పూర్ (1999), అడిలైడ్ (1999), మెల్బోర్న్ (1999) లలో జరిగిన మ్యాచులలో మాత్రమే సచిన్ వార్న్ కు ఔటయ్యాడు. మిగిలిన సందర్బాల్లో మాస్టర్ బ్లాస్టర్ దే పైచేయి. 

1998 షార్జా కప్‌లో ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో సచిన్‌ 148 పరుగులు తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో వార్న్‌కు సచిన్‌ తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపించాడు. ఇదొక్కటి చాలు సచిన్‌- వార్న్‌ల వైరం ఏ రేంజ్‌లో ఉండేదో చెప్పుకోవడానికి. ఒక సందర్భంలో సచిన్‌ హిట్టింగ్‌కు తాను కొన్నేళ్ల పాటు నిద్రలేని రాత్రులు గడిపానని షేన్ వార్న్ స్వయంగా చెప్పుకోవడం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? వన్డేల్లో వార్న్‌పై సచిన్ సగటు 100.00గా ఉండడం విశేషం. ఈ జోడీ మధ్య వైరం  క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అయితే ఆటలో మాత్రమే సచిన్‌- వార్న్‌లు శత్రువులు.. బయట మాత్రం మంచి మిత్రులు. ఎక్కడ కలిసినా ఈ ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరిగేది.

కాగా తన ఆప్తమిత్రుడు వార్న్‌ భౌతికంగా దూరమవడం సచిన్‌ను కలిచివేసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వార్న్‌కు కన్నీటి నివాళి అర్పించాడు. చాలా చిన్న వయసులో వెళ్లిపోయావ్ మిత్రమా.. అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.  ‘దిగ్బ్రాంతికరమైన వార్త.. వార్నీ నిన్ను చాలా మిస్ అవుతాను. మైదానంలో, మైదానం వెలుపల నీతో  ఎప్పుడూ నీరసంగా అనిపంచలేదు. మన ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ చర్యలు ఎల్లప్పుడూ విలువైనదిగా పరిగణిస్తాను.. భారత్ లో నీకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా చిన్న వయసులో వెళ్లిపోయావ్ మిత్రమా..’అంటూ ట్వీట్‌ చేశాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement