
దుమ్మురేపుతోన్న సచిన్ 'క్రికెట్' సాంగ్
ముంబై: సచిన్ టెండూల్కర్... ఈ పేరు తెలియనివారు మనదేశంలో ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో సచిన్ ఫొటో చూసినవారంతా నోరెళ్లబెడుతున్నారు. ఎప్పుడూ బ్యాట్‌తో కనిపించే సచినేంటి? ఇలా..? అంటూ ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలను రేకెత్తించారు. బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్‌తో సచిన్ టెండూల్కర్ కలిసున్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టడంతో ఈ గందరగోళం నెలకొంది. ఇంతకీ సచిన్ ఏం చేయబోతున్నాడు? అలా ఎందుకు ఫొటో దిగాడు? అని ప్రశ్నించుకోవడం కనిపించింది.
చివరికి ‘100 ఎంబీ’ యాప్ కోసం గాయకుడు సోనూతో కలిసి లిటిల్ మాస్టర్ ‘క్రికెట్ వాలీ బీట్’ పాట పాడినట్లు తెలియడంతో అంతా మరింత సంబరాలు చేసుకున్నారు. మొత్తానికి సచిన్ టెండుల్కర్ మొదటిసారి పాట పాడారు. గాయకుడు సోనునిగమ్‌తో కలిసి గొంతుకలిపారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ... ఆరు వరల్డ్ కప్‌లలో నాతోపాటు ఎందరో ఆడారు. వారందరికీ ఈ పాట అంకితం. దేశంలోని ప్రతి అభిమానిని ఈ పాట అలరిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. సోనూనిగమ్‌కు పోటీగా సచిన్ పాట పాడడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సచిన్‌ను అభినందిస్తున్నారు. శుభాకాంక్షల ట్వీట్లు కురిపిస్తున్నారు.