ఎవరినీ మర్చిపోవద్దనుకున్నా... | Sachin Tendulkar Says He Didn't Want To Miss Important Names in Farewell Speech | Sakshi
Sakshi News home page

ఎవరినీ మర్చిపోవద్దనుకున్నా...

Published Mon, Mar 3 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM

ఎవరినీ మర్చిపోవద్దనుకున్నా...

ఎవరినీ మర్చిపోవద్దనుకున్నా...

ముంబై: దాదాపు రెండున్నర దశాబ్దాల క్రికెట్ కెరీర్‌ను ముగిస్తున్న సందర్భంగా వాంఖడే స్టేడియంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇచ్చిన వీడ్కోలు ప్రసంగం అందరినీ కదిలించిన విషయం తెలిసిందే. తన సుదీర్ఘ క్రీడా జీవితంలో సహకరించిన వారందరికీ పేరుపేరునా అందులో కృతజ్ఞతలు తెలిపాడు.
 
  20 నిమిషాలపాటు ఇచ్చిన ఈ ప్రసంగం ఆలోచన కోల్‌కతా నుంచి ముంబైకి విమానంలో వస్తున్నప్పుడు కలిగిందని మాస్టర్ చెప్పాడు. ఎవరినీ మర్చిపోకూడదని అప్పుడే నిర్ణయించుకున్నానని తెలిపాడు. అయితే ఇలాగే మాట్లాడాలని ఏమీ అనుకోలేదని, అంతా అప్పటికప్పుడు హృదయం నుంచి వచ్చిందేనని ఆదివారం తన నివాసం సమీపంలో 25 అడుగులకు పైగా ఎత్తున్న స్టీల్ బ్యాట్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా సచిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
 
 రెండు టన్నుల బరువున్న ఈ బ్యాట్ కింది భాగంలో సచిన్ వీడ్కోలు ప్రసంగాన్ని కూడా ముద్రించారు. ఈ కార్యక్రమంలో సచిన్ అభిప్రాయాలు అతని మాటల్లోనే...
 కోల్‌కతా టెస్టు ఆడాక అక్కడి నుంచి ముంబైకి విమానంలో ప్రయాణిస్తున్నాం. అప్పుడు నేను ఒంటరిగానే కూర్చునున్నాను. ఆ సమయంలో ఇక వాంఖడేలో ఆడే మ్యాచ్ నా చివరిదని అర్థం చేసుకోవడం ప్రారంభించాను.
 
 కెరీర్‌లో తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరినీ తలుచుకోవాలని అనిపించింది. ఇక ముంబై టెస్టు కూడా ముగిశాక ప్రపంచమంతా నేను మాట్లాడాలని కోరుకుంది. పూర్తిగా నా మనసులో నుంచి వచ్చిన ఆ ఉపన్యాసంలో ఎవరి పేరునూ నేను మర్చిపోలేదు. ఆ సమయంలో నేను భావోద్వేగానికి గురయ్యాను.
 
 ఆరోజు నేను అనుకున్నదానికన్నా బాగానే మాట్లాడాను. అంతా భగవంతుడి దయగా భావిస్తాను.
 
 రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అభిమానులు నా మీద చూపిన ఆపేక్షను నమ్మలేకపోయాను. గతంలో నేనెప్పుడూ చవిచూడని అనుభవమది. నా జీవితంలోనే ప్రత్యేక అనుభూతిగా నిలిచిపోయే సంఘటన అది.
 నేను కొద్దికాలం క్రితమే రిటైర్ అయ్యాను. కాబట్టి తిరిగి క్రికెట్ ఆడే విషయాన్ని ఆలోచించలేను.
 
 నా సెకండ్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. రెండు మూడు సార్లు మాత్రం అర్జున్, అతడి స్నేహితులతో కలిసి ఇంట్లో క్రికెట్ ఆడాను.
 
 కఠినంగా శ్రమించడం ద్వారానే ఏ రంగంలోనైనా పైకి వస్తారు. వర్థమాన ఆటగాళ్లు ఈ సూత్రాన్ని పాటించాలి. ఇందుకోసం ఎలాంటి దగ్గరి దారులు ఉండవు.కలలు కనడం తప్పుకాదు. వాటిని నిజం చేసుకోవడం అంతకన్నా ముఖ్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement