
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ డేన్ పీట్ అనూహ్య నిర్ణయంతో ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సభ్యదేశమైన దక్షిణాఫ్రికా జట్టును వదిలి అసోసియేట్ టీమ్ అమెరికాతో జతకట్టేందుకు సిద్ధమయ్యాడు. శనివారం ఉదయమే ఈ ఒప్పందానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని అతను ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘ఈ రోజు ఉదయం కాంట్రాక్ట్‌పై సంతకం చేశా. చాలా కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ... ఇది నాకో మంచి అవకాశం. ఆర్థికంగానూ, జీవనశైలి పరంగానూ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని వదులుకోలేకపోయాను. పైగా గతేడాది అమెరికాకు వన్డే జట్టు హోదా దక్కింది. ఇంకా ఆలోచించడానికి ఏముంది? దక్షిణాఫ్రికా వన్డే తుది జట్టులో తనకు చోటు దక్కే అవకాశాలు అతి స్వల్పంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను ’ అని పీట్ వ్యాఖ్యానించాడు. ఈ వేసవిలో ప్రారంభం కానున్న ‘ మైనర్ లీగ్ టి20 టోర్నమెంట్’ నుంచి అతను అమెరికా తరఫున తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. 2014లో సఫారీ జట్టు తరఫున అరంగేట్రం చేసిన పీట్ తొమ్మిది టెస్టుల్లో 26 వికెట్లు దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment