
కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో గాయపడిన భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పెద్దగా ఆందోళన అవసరం లేదని అంటున్నాడు. తన కుడి చేతి వేలికి గాయం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్న సాహా.. తాను రికవరీ కావడానికి పెద్దగా సమయం అవసరం లేదన్నాడు. కనీసం ఐదు వారాల్లో గాయం నుంచి కోలుకుంటాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోని క్రికెటర్ల పునరావాస శిబిరంలో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నాడు. ఇప్పుడు తాను అదే పనిలో ఉన్నానని పేర్కొన్నాడు.
బంగ్లాదేశ్‌తో పింక్ బాల్ టెస్టులో సాహా గాయపడ్డాడు. గత నెలలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకుని దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పాల్గొన్న సాహా.. మళ్లీ గాయం బారిన పడ్డాడు. అయితే ఇది అంత ఇబ్బందికరమైన గాయం కాదని సాహా పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్ ఆడే నాటికి తాను తిరిగి గాడిలో పడతానన్నాడు. వచ్చే నెలలో విండీస్‌తో భారత్‌కు ద్వైపాక్షిక సిరీస్ ఉన్నప్పటికీ అందులో టెస్టు సిరీస్ లేదు. అందులో కేవలం టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ మాత్రమే ఉంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే వరకూ భారత్‌కు టెస్టు మ్యాచ్‌లు లేవు.