
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయిలు సాయి దేదీప్య, జనగాం సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చెన్నైలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య 6–7 (6/8), 6–1, 6–2తో మేఘా ముత్తుకుమారన్ (తమిళనాడు)పై, సింధు 6–3, 6–1తో ముబాషిరా అంజుమ్ (ఆంధ్రప్రదేశ్)పై గెలిచారు. మేఘాతో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను ‘టై’బ్రేక్‌లో కోల్పోయిన దేదీప్య అనంతరం పుంజుకుంది.
ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా ఆడి తర్వాతి రెండు సెట్‌లను గెలిచి క్వార్టర్స్ బెర్త్ సొంతం చేసుకుంది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో దేదీప్య 6–1, 6–1తో వైశాలి పై, సింధు 6–1, 6–2తో చరణ్య శ్రీకృష్ణన్ (తమిళనాడు)పై విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో కావ్య (తమిళనాడు)తో సాయిదేదీప్య, సాయి అవంతిక (తమిళనాడు)తో సింధు తలపడతారు. డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు–వైశాలి ద్వయం 6–0, 6–3తో ప్రియదర్శిని–పావని (తమిళనాడు) జోడీపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment