జకార్తా: ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. తన దేశానికే చెందిన మూడో ర్యాంక్ ప్లేయర్ పీవీ సింధుపై ఘన విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా క్వార్టర్ ఫైనల్ పోరులో సైనా 21-13, 21-19 తేడాతో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సైనా.. రెండో గేమ్‌లో శ్రమించాల్సి వచ్చింది. చివరకు తన అనుభవాన్ని ఉపయోగించిన సైనా రెండో గేమ్‌ను గెలవడంతో పాటు సెమీస్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.
37 నిమిషాల్లో ముగిసిన పోరులో సైనా ఏకపక్ష విజయం సాధించడం విశేషం. మరొకవైపు తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌లో తుది వరకూ పోరాడింది. కాగా, చివర్లో అనవసర తప్పిదాలు చేయడంతో సింధు ఓటమి పాలైంది. ఇప్పటివరకూ సైనా-సింధులు అంతర్జాతీయ వేదికపై మూడుసార్లు తలపడగా రెండు సార్లు సైనానే గెలుపొందింది. 2014లో సింధుపై సైనా తొలిసారి గెలవగా, 2017 ఇండియా ఓపెన్‌లో సైనాను సింధు ఓడించింది. తాజాగా జరిగిన పోరులో మరొకసారి సైనా గెలిచి ముఖాముఖి ఆధిక్యాన్ని 2-1కు పెంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment