టైటిల్ పోరుకు ‘సై’నా...
* ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో భారత స్టార్
* సెమీస్‌లో ఓడిన శ్రీకాంత్
సిడ్నీ: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించేందుకు... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరో విజయం దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఏడో సీడ్ సైనా 21-8, 21-12తో ప్రపంచ రెండో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించింది.
కేవలం 31 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా రెండు గేముల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. గతంలో యిహాన్ వాంగ్ చేతిలో 11 సార్లు ఓడిన సైనా ఈసారి పక్కా ప్రణాళికతో ఆడి తొలి గేమ్ ఆరంభంలోనే 15-6తో ఆధిక్యంలోకి వెళ్లి ఇక వెనుదిరిగి చూడలేదు. రెండో గేమ్‌లోనూ సైనా ఇదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకొని రెండోసారి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరింది.
2014లో సైనా ఈ టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సున్ యు (చైనా)తో సైనా అమీతుమీ తేల్చుకుంటుంది. సున్ యుతో ముఖాముఖి రికార్డులో సైనా 5-1తో ఆధిక్యంలో ఉంది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ కథ ముగిసింది. సెమీఫైనల్లో శ్రీకాంత్ 20-22, 13-21తో హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు.
నేటి ఫైనల్స్
ఉదయం గం. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం