సైనా అద్భుత విజయం | Saina Nehwal enters quarters with hard fought win in last 16 | Sakshi
Sakshi News home page

సైనా అద్భుత విజయం

Published Fri, Mar 8 2019 12:39 AM | Last Updated on Fri, Mar 8 2019 12:39 AM

Saina Nehwal enters quarters with hard fought win in last 16 - Sakshi

8–21... ప్రిక్వార్టర్స్‌లో సైనా తొలి గేమ్‌ స్కోరిది... కొద్ది నిమిషాల వ్యవధిలోనే  సైనా ఆ గేమ్‌ని కోల్పోయింది. ఇక మ్యాచేం గెలుస్తుందిలే అనుకున్నారంతా! కానీ ఆమె గెలిచి చూపించింది. రెండు, మూడో గేముల్ని వరుసగా గెలిచి క్వారర్స్‌కు దూసుకెళ్లింది. ఈ రెండు గేముల్లోనూ ఆమె జోరు చూస్తే మునుపటి సైనాలా కనిపించింది. ఇదే కసితో మరోసారి ఫైనల్‌ చేరుతుందేమో చూడాలి.

బర్మింగ్‌హామ్‌: భారత వెటరన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ అద్భుత విజయంతో ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఎనిమిదో సీడ్‌ భారత సీనియర్‌ షట్లర్‌ 8–21, 21–16, 21–13తో లైన్‌ హోజ్మర్క్‌ జేర్స్‌ఫెల్డ్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ కూడా క్వార్టర్స్‌ చేరాడు. అతను 21–17, 11–21, 21–12తో జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలుపొందాడు. డబుల్స్‌ మాత్రం భారత ఆటగాళ్లకు కలిసిరాలేదు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్‌ రెడ్డి, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా జోడీలు పరాజయం చవిచూశాయి.  

సూపర్‌ సైనా 
తొలిరౌండ్‌ పోరులో 21–17, 21–18తో స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టీ గిల్మోర్‌పై విజయంతో ప్రతిష్టాత్మక టోర్నీలో శుభారంభం చేసిన సైనా గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ముందు తడబడింది. ప్రత్యర్థి హోజ్మర్క్‌ ధాటికి నిమిషాల వ్యవధిలోనే 8–21తో తొలిగేమ్‌ను కోల్పోయింది. అయితే ఈ గేమ్‌ను ఎంత త్వరగా కోల్పోయిందో అంతే త్వరగా కోలుకుంది. రెండో గేమ్‌లో తన అనుభవాన్ని జోడించి షాట్లకు పదునుపెట్టింది. 2015 ఫైనలిస్ట్‌ అయిన సైనా రెండో గేమ్‌లో దూకుడుగా ఆడింది. ఆరంభంలోనే 6–4తో ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. అయితే  ఈ దశలో హోజ్మర్క్‌ కూడా టచ్‌లోకి రావడంతో 8–8 వద్ద స్కోరు సమమైంది.

తర్వాత కోర్టులో చురుగ్గా కదిలిన భారత క్రీడాకారిణి ఒక్కో పాయింట్‌తో ప్రత్యర్థిని అధిగమించింది. వరుసగా నాలుగు పాయింట్లతో 16–12కు చేరిన ఆమెకు ఈ గేమ్‌ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా జోరు ముందు డెన్మార్క్‌ షట్లర్‌ నిలువలేకపోయింది. 2–0తో తర్వాత 5–1తో ఇలా హైదరాబాదీ రాకెట్‌ దూసుకెళ్తుంటే... ప్రత్యర్థి మాత్రం చేతులెత్తేసింది. 18–12తో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలిచే స్థితిలోకి వచ్చిన సైనా తన ప్రత్యర్థి ఒక పాయింట్‌ చేసేలోపే మూడు పాయింట్లు చేసి గెలిచింది. మొత్తంగా 51 నిమిషాల్లో ఆటను ముగించి క్వార్టర్స్‌ పోరుకు సిద్ధమైంది. 

ఆసియా చాంప్‌కు శ్రీకాంత్‌ షాక్‌ 
పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తెలుగు షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఏడో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌ గెలుపొందగా... భమిడిపాటి సాయిప్రణీత్‌కు పరాజయం ఎదురైంది. ఆసియా క్రీడల చాంపియన్‌ జొనాథన్‌ క్రిస్టీకి భారత స్టార్‌ శ్రీకాంత్‌ షాకిచ్చాడు. గత రెండు మ్యాచ్‌లలో అతని చేతిలో ఓడిన శ్రీకాంత్‌ మేటి టోర్నమెంట్‌లో మాత్రం పైచేయి సాధించాడు. సుమారు గంట (58 నిమిషాలు) పాటు జరిగిన పోరులో శ్రీకాంత్‌ 21–17, 11–21, 21–12తో ఇండోనేసియా ప్రత్యర్థిపై గెలుపొందాడు. క్వార్టర్స్‌లో భారత ఆటగాడు... టాప్‌సీడ్‌ కెంటో మొమోటా (జపాన్‌)తో తలపడనున్నాడు.

సాయిప్రణీత్‌ మాత్రం వరుస గేముల్లో 12–21, 17–21తో ఎన్జీ క లాంగ్‌ అంగస్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓటమి చవిచూశాడు. సమీర్‌ వర్మకు తొలి రౌండ్లో చుక్కెదురైంది. అతను 21–16, 18–21, 14–21తో మాజీ ప్రపంచ చాంపియన్, నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్సన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్‌ రెడ్డి ద్వయం 19–21, 21–16, 14–21తో ఒయు జుయాన్యి–రెన్‌ జియాంగ్యు (చైనా) జోడీ చేతిలో కంగుతినగా... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంట 21–23, 17–21తో చంగ్‌ తక్‌ చింగ్‌–వింగ్‌ యంగ్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement