సరదాలు మాని శ్రమించాలి!
అప్పుడే కెరీర్‌లో ఎదగవచ్చు
విద్యార్థులకు సైనా మార్గనిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ‘చాలా చిన్న వయసులో నేను బ్యాడ్మింటన్‌ను ఎంచుకున్నాను. ఆటతో పాటు చదువును కొనసాగించడంలో బాగా ఇబ్బంది పడ్డాను. అయితే పట్టుదలతో సమన్వయం చేసుకున్నా. అందుకే ఏ రంగాన్ని ఎంచుకున్నా బాగా కష్టపడితేనే మంచి ఫలితాలు దక్కుతాయి’ అని భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది.
శనివారం ఇక్కడి శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె విద్యార్థులతో ముచ్చటించింది. ఈ పాఠశాలకు సైనా ఏడాది కాలం పాటు చీఫ్ మెంటర్‌గా కూడా వ్యవహరించనుంది. ఇటీవలే ఈ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా చిన్నారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సైనా వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసింది.
ఇన్నేళ్లపాటు కష్ట పడటం వల్లే తాను ఒలింపిక్ పతకం నెగ్గగలిగానని, ప్రతీ ఒక్కరు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా శ్రమించాలని ఆమె చెప్పింది. సాధించిన విజయాలతో సంతృప్తి పడకుండా మరింత మెరుగ్గా రాణించాలని సైనా విద్యార్థులకు మార్గ నిర్దేశం చేసింది.
భవిష్యత్తులో అమెరికా, కెనడాలాంటి దేశాల్లో బ్యాడ్మింటన్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తానని ఈ షట్లర్ వెల్లడించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆమె బహుమతులు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో స్కూల్ డెరైక్టర్ మనీశ్ కుమార్, కంట్రీ డెరైక్టర్ ప్రదీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు.