తొలిరౌండ్‌లోనే సైనా, సింధు ఓటమి
కుచింగ్: మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. అజయ్ జయరామ్ మినహా... మిగతావారంతా తొలిరౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో పీవీ సింధు 21–18, 19–21, 17–21తో అన్‌సీడెడ్ చెన్ యుఫీ (చైనా) చేతిలో... సైనా నెహ్వాల్ 21–19, 13–21, 15–21తో అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయారు. సింధు, సైనా తొలి గేమ్‌లో నెగ్గినప్పటికీ... ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకున్నారు.
మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో అజయ్ జయరామ్ 21–11, 21–8తో కియో బిన్ (చైనా)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా... సాయిప్రణీత్ 21–18, 19–21, 18–21తో చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 21–18, 18–21, 17–21తో లియో కువాన్ హో–లు చియా పిన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో... మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 19–21, 21–19, 21–23తో కిమ్ అస్‌ట్రుప్–జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓటమి పాలయ్యాయి.