శామ్యూల్స్ బౌలింగ్ పై ఫిర్యాదు
కొలొంబో: వెస్టిండీస్ ఆల్ రౌండర్ మార్లోన్ శామ్యూల్స్ బౌలింగ్ శైలి మరోసారి అనేక అనుమానాలకు తావిచ్చింది. గతవారం గాలేలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అతని బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉండటంతో మ్యాచ్ అధికారులు దృష్టి సారించారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఫిర్యాదు చేశారు.
దీంతో శ్యామ్యూల్స్ 14 రోజుల్లో తన బౌలింగ్ యాక్షన్ కు సంబంధించి పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం అప్పటివరకూ శామ్యూల్స్ జట్టులో కొనసాగుతాడు. అంటే రెండో టెస్టులో శామ్యూల్స్ ఆడటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా శామ్యూల్స్ తన బౌలింగ్ శైలిపై ఫిర్యాదులు ఎదుర్కొవడం మూడోసారి. ఇప్పటివరకూ 60 టెస్టు మ్యాచ్ లు ఆడిన శామ్యూల్స్ 41 వికెట్లు తీశాడు. 2008వ సంవత్సరంలో డర్బన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా అతని బౌలింగ్ పై తొలిసారి ఫిర్యాదులు చోటు చేసుకున్నాయి.