హెరాత్‌కు 9 వికెట్లు Sanga, Mahela put Sri Lanka on top against Pakistan | Sakshi
Sakshi News home page

హెరాత్‌కు 9 వికెట్లు

Published Sun, Aug 17 2014 1:12 AM

హెరాత్‌కు 9 వికెట్లు

- రాణించిన సంగక్కర, జయవర్ధనే
- ఆధిపత్యం దిశగా శ్రీలంక
- పాకిస్థాన్‌తో రెండో టెస్టు

కొలంబో: శ్రీలంక సీనియర్ స్పిన్నర్ రంగన హెరాత్ చెలరేగాడు. పాకిస్థాన్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు (9/127) పడగొట్టి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. హెరాత్ మెరుపులకు తోడు సంగక్కర, జయవర్ధనే రాణించడంతో రెండో టెస్టుపై శ్రీలంక ఆధిపత్యం ప్రదర్శించే దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 244/6తో మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్.. హెరాత్ ధాటికి 332 పరుగుల వద్ద ఆలౌటైంది.

రెండో రోజే ఐదు వికెట్లు పడగొట్టిన హెరాత్.. మూడోరోజు మరో నాలుగు వికెట్లు తీశాడు. దీంతో మురళీధరన్ తరువాత శ్రీలంక తరపున ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా ఘనత సాధించాడు. పాకిస్థాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (127 బంతుల్లో 103; 7 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించి.. ఆ జట్టు తరపున గత ఐదేళ్లలో ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు.
 
జయవర్ధనే ‘వీడ్కోలు’ ఇన్నింగ్స్

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 79 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన లంకను జయవర్ధనే (123 బంతుల్లో 49 బ్యాటింగ్; 7 ఫోర్లు), సంగక్కర (121 బంతుల్లో 54 బ్యాటింగ్; 4 ఫోర్లు) అదుకున్నారు. మూడో వికెట్‌కు అజేయంగా 98 పరుగులు జోడించిన జయవర్ధనే-సంగక్కర జోడి రికార్డు స్థాయిలో 47వ సారి అర్ధసెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా శ్రీలంక ఇప్పటికే 165 పరుగుల ఆధిక్యంలో ఉంది.

సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 320 ఆలౌట్, పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 332 ఆలౌట్, శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 63 ఓవర్లలో 177/2.

Advertisement
 
Advertisement
 
Advertisement