
PAK VS NZ 2nd Test 3rd Day: కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ ధీటుగా బదులిస్తుంది. సౌద్ షకీల్ (336 బంతుల్లో 124 నాటౌట్; 17 ఫోర్లు) టెస్ట్‌ల్లో తన తొలి శతకంతో రెచ్చిపోవడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిధ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది.
షకీల్‌కు జతగా ఇమామ్ ఉల్ హాక్ (83), వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (78) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆఘా సల్మాన్ (41) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. ఇష్ సోధీ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
అంతకుముందు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 449 పరుగులకు ఆలౌటైంది. డెవాన్ కాన్వే (122) సెంచరీతో చెలరేగగా.. టామ్ లాథమ్ (71), టామ్ బ్లండల్ (51), మ్యాట్ హెన్రీ (68) అర్ధశతకాలతో రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4 వికెట్లతో సత్తా చాటగా.. నసీమ్ షా, అఘా సల్మాన్ 3 వికెట్లతో రాణించారు.
కాగా, సప్పగా సాగుతున్న ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దీనికి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం బౌలర్లకు అనుకూలమైన పిచ్‌లు తయారు చేశారని విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వరుస పరాభవాలను తప్పించుకునేందుకు ఈ సిరీస్ కోసం నిర్జీవమైన పిచ్‌లు తయారు చేసింది. ఇంగ్లండ్ చేతిలో పాక్ 0-3 తేడాతో వైట్‌వాష్ అయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment