ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ (27 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి కివీస్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించగా.. 417 రోజుల తర్వాత టీ20 మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (57) రాణించాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిన్ అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో మార్క్ చాప్‌మన్ (11 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే, ఐష్ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్ ఫిలిప్స్ 19, ఆడమ్ మిల్నే 10 పరుగులు చేశారు. మ్యాట్ హెన్రీ 0, టిమ్ సౌథీ 6 పరుగులతో అజేయంగా నిలిచారు.
డారిల్ మిచెల్ క్రీజ్‌లో ఉన్న సమయంలో కివీస్ 250కి పైగా పరుగులు చేసేలా కనిపించింది. అయితే అతను ఔటైన తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవ్వరూ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడకపోవడంలో కివీస్ 226 పరుగులతో సరిపెట్టుకుంది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-46-3), ఆమిర్ జమాల్ (4-0-56-0), ఉసామా మిర్‌లను (4-0-51-0) కివీస్ బ్యాటర్లు ఆటాడుకున్నారు. ముఖ్యంగా షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్‌లకు చుక్కలు చూపించారు.
కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్.. షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో 2 సిక్స్‌లు, 3 బౌండరీల సాయంతో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. పాకిస్తాన్‌ను అబ్బాస్ అఫ్రిది (4-0-34-3), హరీస్ రౌఫ్ (4-0-34-2) కాపాడారు. వీరిద్దరు కాస్త పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు కూడా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment