
అబుదాబి: రెండో టెస్టులో ఒక దశలో పాకిస్తాన్ స్కోరు 57/1. మరికొద్ది సేపటికే ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ (4/78) దెబ్బకు 57/5. అతను రెండు ఓవర్లలోనే ఆటను మార్చేశాడు. దీంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 282 పరుగులు చేసి ఆలౌటైంది. ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన లయన్ తొలి నాలుగు బంతులకు 4 పరుగులు సమర్పించుకున్నాడు. అప్పుడు జట్టు స్కోరు 57/1. తర్వాత రెండు బంతులకు అజహర్ అలీ (15), హరిస్ సొహైల్ (0)ను ఔట్ చేశాడు.
తన తదుపరి ఓవర్ (22వ) రెండో బంతికి షఫీక్, నాలుగో బంతికి బాబర్ అజమ్‌లను డకౌట్ చేశాడు. ఇలా ఆరు బంతుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు తీయడంతో 57/5 స్కోరు వద్ద పాక్ కుదేలైంది. అయితే తొలి టెస్టు ఆడుతున్న ఫఖర్ జమాన్ (94; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ సర్ఫరాజ్ (94; 7 ఫోర్లు)ల పోరాటంతో కోలుకుంది. ఇద్దరు 6 పరుగుల దూరంలో సెంచరీలను చేజార్చుకున్నా... ఆరో వికెట్‌కు 147 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. లబ్‌షేన్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ గత మ్యాచ్ హీరో ఉస్మాన్ ఖాజా (3) సహా 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.