వార్నర్ మెరుపు ఇన్నింగ్స్
మెల్‌బోర్న్: పాకిస్తాన్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ వార్నర్ వీరవిహారం చేశాడు. వార్నర్ మెరుపు శతకం (144పరుగులు: 143బంతుల్లో 17ఫోర్లు, ఒక సిక్సర్) చేయడంతో ఆసీస్ స్కోరు పరుగులు పెట్టింది. వార్నర్ టెస్ట్ కెరీర్లో ఇది 17వ సెంచరీ. ఈ క్రమంలో టెస్టుల్లో ఐదువేల పరుగులు పూర్తిచేసుకున్న 19వ ఆసీస్ ప్లేయర్ గా నిలిచాడు. మరో ఓపెనర్ రెన్షా(10) క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బందులు పడి చివరికి తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఉస్మాన్ ఖవాజా హాఫ్ సెంచరీ(73నాటౌట్: 122 బంతుల్లో 10 ఫోర్లు)తో కలిసి వార్నర్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు స్కోరును మరింత పెంచే క్రమంలో ఇన్నింగ్స్ స్కోరు 244 వద్ద వహాబ్ రియాజ్ బౌలింగ్ లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. 50 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కాగా, పాక్ తమ తొలి ఇన్నింగ్స్ ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది.
అంతకుముందు పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అజహర్ అలీ అద్భుత ఇన్నింగ్స్ (205 నాటౌట్: 364 బంతుల్లో 20 ఫోర్లు ) తో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి పాక్ క్రికెటర్ గానూ రికార్డు నెలకొల్పాడు. మెల్‌బోర్న్ స్డేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో ప్లేయర్ గా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 1984లో వెస్డిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ చేసిన 208 పరుగులే ఇక్కడ అత్యధికం. సోహైల్ ఖాన్(65 బంతుల్లో 65: 6 ఫోర్లు, 4 సిక్సర్లు)తో కలిసి ఎనిమిదో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో బర్డ్, హాజెల్‌వుడ్‌కు చెరో మూడు వికెట్లు దక్కాయి.