పాకిస్తాన్ ను కుమ్మేసి.. కూల్చేశారు!
మెల్బోర్న్:గత కొంతకాలంగా అసలు సిసలు ఆట తీరును మరిచిపోయిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు..ఎట్టకేలకు తన పూర్వ వైభవాన్ని చాటుకుంది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత పాకిస్తాన్ ను కుమ్మేసిన ఆసీస్.. ఆ తరువాత పాక్ ను కూల్చేసి ఘనమైన విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్ లో ఆసీస్ అమోఘంగా రాణించడంతో పాకిస్తాన్ కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. తొలి టెస్టులో ఓటమి పాలైనప్పటికీ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్న పాకిస్తాన్.. రెండో టెస్టులో మాత్రం పూర్తిగా చతికిలబడింది. ప్రధానంగా రెండో ఇన్నింగ్స్ ఆసీస్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో డీలా పడిన పాకిస్తాన్ ఇన్నింగ్స్ 18 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్ లో 53.2 ఓవర్లలో 163 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలైంది. పాక్ ఆటగాళ్లలో అజహర్ అలీ(43), సర్ఫరాజ్ (43) మినహా ఎవరూ రాణించకపోవడంతో పాక్ కు పరాజయం తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో స్టార్ నాలుగు, లయన్ మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు.
అంతకుముందు 465/6 ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 624/8 వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. స్టీవ్ స్మిత్(165 నాటౌట్), డేవిడ్ వార్నర్(144), హ్యాండ్ స్కాంబ్(54), స్టార్క్(84) లు రాణించి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఈ మ్యాచ్ లో విజయంతో సిరీస్ ను ఆసీస్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
పాక్ తొలి ఇన్నింగ్స్ 443/9 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 163 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 624/8 డిక్లేర్