రోజులో ఓ రెండు గంటల సమయం వ్యాయామానికి కేటాయిస్తే శారీరకంగానూ.. మానసికంగానూ బలంగా ఉండొవచ్చని సూచిస్తున్నారు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. కొత్తగా తల్లైన వారు బరువు పెరగడం సహజమని... అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. ఇజహాన్‌కు జన్మనిచ్చిన రెండున్నర నెలల తర్వాత తాను వర్కౌట్ చేయడం ప్రారంభించానని పేర్కొంటూ.. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
26 కిలోలు తగ్గాను...
‘ప్రసవం తర్వాత ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉండటానికి నేను చేసిన వర్కౌట్ల గురించి చాలా మంది నన్ను అడిగారు. వాళ్ల కోసమే ఈ వీడియోలు పోస్ట్ చేస్తున్నా. గర్భవతిగా ఉన్న సమయంలో దాదాపు 23 కిలోల బరువు పెరిగాను. ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు కఠినంగా శ్రమించాను. అలా 4 నెలల్లో 26 కిలోలు తగ్గాను. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మునుపటి ఆకృతి పొందాలని చాలా మంది భావిస్తారు. ఇది కేవలం అందానికి సంబంధించిన విషయం కాదు. శారరీక, మానసిక ఆరోగ్యానికి సంబంధించినది. డియర్ లేడీస్ మీరు చేయాలని సంకల్పించుకుంటే తప్పక చేస్తారు. నన్ను నమ్మండి.. రోజుకు గంట లేదా 2 గంటల సమయాన్ని వ్యాయామానికి కేటాయించండి. ఇజహాన్ పుట్టిన తర్వాత రెండున్నర నెలలకు నేను కసరత్తులు చేయడం ప్రారంభించాను’ అంటూ సానియా మీర్జా తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోలు షేర్ చేశారు. ఈ క్రమంలో సానియా వీడియోలకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. సూపర్ సానియా. ఇలాంటి వీడియోలు షేర్ చేసినందుకు థ్యాంక్యూ. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను బాగా చెప్పారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా గతేడాది అక్టోబరులో క్రీడా దంపతులు సానియా మీర్జా- షోయబ్ మాలిక్ మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment