క్రీడాకారిణుల పట్ల దృక్పథం మారాలి
భువనేశ్వర్: భారత్‌లో ఓ మహిళ సెలబ్రెటీకి క్లిష్టమైన సవాళ్లే ఎదురవుతాయని సానియా మీర్జా చెప్పింది. పెను సవాళ్లను ఎదుర్కొనే తాను ఈ స్థాయికి ఎదిగానని తెలిపింది. పురుషాధిక్య సమాజంలో క్రీడాకారిణుల పట్ల అవలంభించే దృక్పథంలో మార్పు రావాలని ఆమె అభిప్రాయపడింది. ఆదివారం ఇక్కడ జరిగిన ‘క్రీడల్లో మహిళలు-ముందడుగు’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆమె పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ ‘ఇక్కడ మహిళా సెలబ్రిటీ కావడమే కష్టమైన పని. వీరిని ఆడిగే ప్రశ్నల సరళే ఓ విధంగా ఉంటుంది.
ఏ డ్రెస్సులు వేస్తారు? ఏం మాట్లాడతారు? మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు లాంటి కొంటే ప్రశ్నలే. పురుషులకు మాత్రం ఇలాంటి ప్రశ్నలు ఉండవు. అంతెందుకు సంతానం గురించి నన్నడిగినట్లు మావారి (షోయబ్ మాలిక్)ని ఎన్నడు అడిగిన దాఖలాల్లేవ్.
ఇక్కడ నేను చెప్పేదొక్కటే... క్రీడాకారిణుల పట్ల ప్రజల ధోరణి మారాలి’ అని ఆమె పేర్కొంది. మహిళా ప్లేయర్లు సవాళ్లపై సమరం చేయాలని ఆమె సూచించింది. అప్పుడే లక్ష్య సాధనకు చేరువవుతారని చెప్పింది. ‘భారత్, ఆస్ట్రేలియా మధ్య కటక్ వన్డే వర్షార్పణమైంది. మీడియాలో దీని ప్రాధాన్యమే వేరు. అంటే... పురుషుల క్రికెట్ ఆడినా ప్రముఖ వార్తే, రద్దయినా అంతే ప్రాధాన్యం! కానీ మహిళ క్రికెట్ మ్యాచ్‌లపై అ స్థాయి వార్తల్ని నేనెన్నడు చూడలేదు, చదవలేదు’ అని హైదరాబాదీ స్టార్ పేర్కొంది.