సంజయ్ బంగర్
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనంతరం సంజయ్ బంగర్ ప్రవర్తించిన తీరు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మిగతా కోచింగ్ సిబ్బందికి పొడిగింపు ఇచ్చి తనను విస్మరించినందుకు రగిలిపోయిన బంగర్... ఇటీవలి వెస్టిండీస్ పర్యటనలో జట్టుతో పాటు ఉన్న జాతీయ సెలక్టర్ దేవాంగ్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించాడు. హోటల్‌లోని దేవాంగ్ గాంధీ గదికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఓ దశలో మరింత కోపోద్రిక్తుడయ్యాడు. ఈ విషయమంతా బోర్డు దృష్టికి వచ్చింది.
దీంతో బంగర్‌ను ప్రశ్నించాలని నిర్ణయించింది. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సునీల్ సుబ్రమణియన్, చీఫ్ కోచ్ రవిశాస్త్రిలను ఘటనపై నివేదిక కోరింది. బంగర్ ఆవేదనలో అర్థం ఉన్నా సెలక్టర్లను ప్రశ్నించే హక్కు అతడికి లేదని స్పష్టంచేసింది. ‘రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌ల పనితీరు బాగున్నందుకే కొనసాగింపు ఇచ్చాం. అదేమీ లేని బంగర్ మళ్లీ అవకాశం దక్కుతుందని ఎలా అనుకుంటాడు? ఎవరైనా సరే నిబంధనలు పాటించాల్సిందే.
జట్టు మేనేజ్‌మెంట్ నివేదిక వచ్చాక దానిని క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) ముందుంచుతాం’ అని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇటీవలి ప్రక్రియలో హెడ్ కోచ్ నియామకాన్ని క్రికెట్ సలహా మండలి చూసుకోగా, సహాయ కోచ్‌లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మరోవైపు జట్టులోకి తీసుకోకపోవడంపై ఆటగాళ్లు సోషల్ మీడియాలో సెలక్టర్లపై కామెంట్లు చేస్తుండటం పైనా చర్చ నడుస్తోంది. గత సీజన్‌లో 850 పైగా పరుగులు చేసినా దులీప్ ట్రోఫీకి పరిగణనలోకి తీసుకోని వైనాన్ని సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ షెల్డన్ జాక్సన్ ప్రశ్నించాడు. ఇలాంటివాటిపై చర్యలు తీసుకునేలా సీవోఏ ఓ విధానం రూపొందించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment