
న్యూఢిల్లీ: రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చానుకు న్యాయం జరుగనుంది. ఇటీవలే ఆమెను నిర్దోషిగా అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ప్రకటించగా... డోపింగ్ ఆరోపణల కారణంగా తనకు ఇన్నాళ్లూ దూరమైన అర్జున అవార్డు ఆమె చెంత చేరనుంది. 2018 ఏడాదికి గానూ ఆమెకు ప్రతిష్టాత్మక ‘అర్జున’ను అందజేయనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. 2018 ఏడాదికి సంజిత ‘అర్జున’ను పొందనుందని ఆయన వెల్లడించారు. 2018 మే నెలలో డోపింగ్ ఆరోపణలతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆగస్టులో సంజిత దాఖలు చేసిన ఫిటిషన్‌పై విచారించిన ఢిల్లీ హైకోర్టు... అవార్డు నామినీల కేటగిరీలో సంజిత దరఖాస్తును పరిశీలించాలని అవార్డుల కమిటీని కోరింది. తమ తుది నిర్ణయాన్ని సీల్డ్ కవర్‌లో భద్రపరచాలని సూచించిన హైకోర్టు ఆమె నిర్దోషిగా బయటపడినపుడు దాన్ని బయటపెట్టాలని పేర్కొంది.