►రెండో వన్డేలో భారత్ 50 పరుగులతో విజయం
►రాణించిన కోహ్లి, రహానే
►కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’
►భువనేశ్వర్ 3/9
►మూడో వన్డే ఆదివారం
భారత్ తమదైన శైలిలో మరోసారి సత్తా చాటింది. శ్రీలంకను చిత్తుగా ఓడించి వచ్చినా, ఆస్ట్రేలియాతో అంత సులువు కాదని అంతా భావించారు. అయితే అద్భుతమైన ఆట ముందు ఆసీస్ అయినా ఎవరైనా ఒకటే అని మన జట్టు మళ్లీ రుజువు చేసింది. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు నిలవలేక కంగారూలు మళ్లీ తలవంచారు. భారీ స్కోరు సాధించకపోయినా... తమ బౌలింగ్ వనరులతో చెలరేగిన కోహ్లి సేన ప్రత్యర్థి పని పట్టింది. వరుసగా రెండో విజయంతో సిరీస్‌పై పట్టు బిగించింది. కోహ్లి కీలక ఇన్నింగ్స్... అండగా నిలిచిన రహానే... ఈ ఇద్దరి శతక భాగస్వామ్యం భారత్‌ను నడిపించాయి. చివర్లో ఎలాంటి మెరుపులు లేకున్నా... జట్టు మెరుగైన స్కోరుతో సవాల్ విసిరింది. ఛేదనలో భువనేశ్వర్ కుమార్ దెబ్బకు 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ గత మ్యాచ్ వైఫల్యాన్నే కొనసాగించింది. మధ్యలో కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ జోరుకు ఆ జట్టు కుదేలైంది. స్మిత్, స్టొయినిస్ అర్ధ సెంచరీలు గెలుపు అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాయి.
కోల్‌కతా: ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో భారత్ మళ్లీ పైచేయి సాధించింది. సమష్టి కృషితో టీమిండియా మరో సారి సత్తా చాటింది. గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్ 50 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి (107 బంతుల్లో 92; 8 ఫోర్లు) త్రుటిలో సెంచరీ కోల్పోగా, అజింక్య రహానే (64 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ స్టొయినిస్ (65 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (76 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ సాధించడం విశేషం. 33వ ఓవర్లో వరుస బంతుల్లో వేడ్, అగర్, కమిన్స్‌లను కుల్దీప్ అవుట్ చేశాడు. విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో మూడో వన్డే ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది.
సెంచరీ భాగస్వామ్యం...
35 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 185/3. కోహ్లి మరో సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఈ దశలో భారత్ 300 పరుగులు చేసేలా కనిపించింది. అయితే తర్వాతి ఐదు ఓవర్ల వ్యవధిలో కోహ్లితో పాటు పాండే, ధోని కూడా అవుట్ కావడంతో భారత్ జోరుకు కళ్లెం పడింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ చివర్లో కూడా భారత్ ఆఖరి 20 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది.
పిచ్‌పై ఉన్న తేమను బాగా ఉపయోగించుకున్న ఆసీస్ పేసర్లు కమిన్స్, కూల్టర్ నీల్ ఆరంభంలో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఆరో ఓవర్లో కూల్టర్‌నీల్‌కు రోహిత్ శర్మ (7) రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో రహానే, కోహ్లి కలిసి చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. జాగ్రత్తగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. అయితే రహానే రనౌట్‌తో వీరిద్దరి 102 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రెండో పరుగు తీసే ప్రయత్నంలో కోహ్లి వేగానికి తగిన విధంగా స్పందించని రహానే వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటి వరకు కోల్‌కతా వేడిలో చెమటలు చిందిస్తూ ఇబ్బంది పడిన ఆసీస్‌కు ఈ వికెట్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదే జోరులో తక్కువ వ్యవధిలో పాండే (3), ధోని (5), కోహ్లిలను అవుట్ చేసి ఆ జట్టు పట్టు బిగించింది. ఒక దశలో తాను ఆడిన వరుస బంతుల్లో 4, 4, 6 కొట్టి దూకుడు ప్రదర్శించిన కేదార్ జాదవ్ (24 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. పాండ్యా (20), భువనేశ్వర్ (20) కలిసి ఏడో వికెట్‌కు 35 పరుగులు జత చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. సొంతగడ్డపై ముందుగా బ్యాటింగ్ చేస్తూ భారత్ ఆలౌట్ కావడం 2013 జనవరి (పాక్‌పై) తర్వాత ఇదే తొలిసారి.
స్మిత్ మినహా...
సాధారణ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరోసారి తడబాటుకు లోనైంది. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్ ముందు ఆసీస్ ఓపెనర్లు పరుగు తీయడమే గగనంగా మారింది. భువీ జోరుకు ముందుగా కార్ట్‌రైట్ (15 బంతుల్లో 1), ఆ తర్వాత వార్నర్ (9 బంతుల్లో 1) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అనంతరం స్మిత్, హెడ్ (39 బంతుల్లో 39; 5 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. 15 పరుగుల వద్ద హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ వదిలేయగా... వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంత సేపు చకచకా పరుగులు సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచారు. ఈ జంట మూడో వికెట్‌కు 73 బంతుల్లోనే 76 పరుగులు జత చేసిన అనంతరం చహల్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కుల్దీప్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది జోరు ప్రదర్శించిన మ్యాక్స్‌వెల్ (14) ఎక్కువ సేపు నిలవలేదు. చహల్ చక్కటి బంతికి ధోని మెరుపు స్టంపింగ్ తోడై మ్యాక్సీ పెవిలియన్ చేరాడు. మరో ఎండ్‌లో 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్... పాండ్యా ఉచ్చులో చిక్కాడు. బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడబోయి జడేజాకు క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది. చివర్లో స్టొయినిస్ పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
►భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన మూడో బౌలర్ కుల్దీప్ యాదవ్. గతంలో చేతన్ శర్మ (న్యూజిలాండ్‌పై), కపిల్‌దేవ్ (శ్రీలంకపై) ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో కుల్దీప్‌కిది రెండో హ్యాట్రిక్. 2014లో జరిగిన అండర్–19 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కుల్దీప్ ‘హ్యాట్రిక్’ సాధించాడు.
► 1 ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో విజయం సాధించిన భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, భారత్ 119 రేటింగ్ పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి.
మళ్లీ అదరగొట్టారు
Published Fri, Sep 22 2017 12:10 AM | Last Updated on Fri, Sep 22 2017 12:45 PM
Advertisement
Advertisement