
రష్యాలో సీమా పూనియా శిక్షణ!
భారత డిస్కస్ త్రోయర్ సీమా పూనియా... డోపింగ్ స్కామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న రష్యాలో శిక్షణ తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం రష్యాలోనే ఉన్న ఆమె రష్యన్ కోచ్ విటాలియో పిచ్‌లెంకోవ్‌తో కలిసి సామాజిక సైట్లలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడే శిక్షణ తీసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కేంద్ర క్రీడాశాఖ, నాడా, సాయ్, అథ్లెటిక్స్ సమాఖ్యలను మెయిల్ ద్వారా కోరింది. ‘రష్యాలో శిక్షణ విషయంపై అనుమతి కోరా. ఇంటి నెంబర్‌తో సహా ఇక్కడి అడ్రస్‌ను ఇస్తానని చెప్పా. ఆగస్టు మొదటి వారం ఇక్కడే ఉండి ఆ తర్వాత రియో వెళ్తా’ అని పూనియా పేర్కొంది.
అయితే ఈ విషయంలో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతానికి తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఏఎఫ్‌ఐ అధికారి ఒకరు తెలిపారు. రష్యాలో శిక్షణ కోసం తన సొంత డబ్బును ఉపయోగించుకుంటున్నానని పూనియా తెలిపింది. అయితే పూనియాకు శిక్షణ ఇవ్వనున్న విటాలియో.... లండన్ ఒలింపిక్స్‌లో డోపింగ్‌లో పట్టుబడ్డ డార్యా పిచ్‌లెంకోవ్‌కు తండ్రి.