రష్యాకు ఎదురుదెబ్బ!
ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లకు నో ఎంట్రీ
తీర్పు వెలువరించిన సీఏఎస్
నిషేధం దిశగా అడుగులు
లుసానే: డోపింగ్ స్కామ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తమ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు రియోలో పాల్గొనకుండా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) గురువారం తోసిపుచ్చింది. రష్యా అథ్లెట్లు రియోలో పాల్గొనేందుకు అర్హత లేదని స్పష్టం చేసింది. అలాగే ఐఏఏఎఫ్ విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ‘తమ కింద పనిచేసే జాతీయ సమాఖ్యలను ఐఏఏఎఫ్ సస్పెండ్ చేసినప్పుడు దానికి సంబంధించిన అథ్లెట్లు కూడా అనర్హులవుతారు. ఇది ఐఏఏఎఫ్ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఫలితంగా ఆయా సమాఖ్యలకు చెందిన అథ్లెట్లు గేమ్స్‌లో పాల్గొనడానికి వీల్లేదు’ అని సీఏఎస్ కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పుతో రష్యాకు చెందిన 68 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల భవిష్యత్ ప్రస్తుతానికి సందిగ్దంలో పడింది. కోర్టు తీర్పు అథ్లెట్లకు అంతిమయాత్ర వంటిదని రష్యా పోల్‌వాల్ట్ మాజీ చాంపియన్ ఇసిన్ బయోవా తెలిపింది.
ఐఓసీ ఏం చేస్తుందో...!
సీఏఎస్ తీర్పు తర్వాత బంతి ఇప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కోర్టులోకి వెళ్లింది. ఓ రాష్ట్రమే డోపింగ్‌కు కేంద్రంగా మారడంతో రష్యాపై కచ్చితంగా నిషేధం విధించాల్సిందేనని చాలా దేశాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు రియో ఒలింపిక్స్‌కు మరో 15 రోజులే గడువు ఉండటంతో ఇప్పుడు ఐఓసీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. సీఏఎస్ తీర్పు తర్వాత రష్యాకు చెందిన మిగతా క్రీడాకారులు కూడా గే మ్స్‌లో పాల్గొనే అంశంపై స్పష్టత కరువైంది. రష్యాపై పూర్తి నిషేధం విధించడానికి ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు తొలి అడుగని విశ్లేషకులు భావిస్తున్నారు.