
ఆదాయంలోనూ 'టాప్'!
మాస్కో: సెరెనా విలియమ్స్, మారియా షరపోవా.. ఇద్దరూ పేర్లూ టెన్నిస్ అభిమానులకు సుపరిచతమే. వీరిద్దరూ స్టేడియాల్లో చేసే హడావుడి ప్రేక్షకులకు వీనుల విందుగా ఉంటుంది. ఈ భామలిద్దరూ ఒకేసారి తలపడుతున్నారంటే అరుపులు, కేకలకు కొదవ ఉండదు. అయితే పేలవమైన ఫామ్తో పాటు, డోపింగ్ ఆరోపణలతో షరపోవా ఢీలా పడితే, వరుసగా రెండు గ్రాండ్ స్లామ్ల్లో ఫైనల్ కు చేరి టైటిల్ వేటలో సెరెనా చతికిలబడింది. గతేడాది మూడు గ్రాండ్ స్లామ్లు(ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్) గెలిచిన సెరెనా, ఈ ఏడాది రెండు టైటిల్స్కు(ఆస్ట్రేలియా, ఫ్రెంచ్) అడుగుదూరంలో నిలిచిపోయి రన్నరప్గా సరిపెట్టుకుంది. 2015లో మంచి ఫామ్లో ఉన్న సెరెనా. .ఈ ఏడాదికొచ్చేసరికి ఆటలో అదృష్టం కలిసిరాకపోయినా, ఆదాయంలో మాత్రం టాప్కు ఎగబాకింది.
తాజాగా ఫోర్బ్స్ వెల్లడించిన అత్యధిక సంపాదన క్రీడాకారిణుల జాబితాలో సెరెనా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ప్రైజ్ మనీ, వాణిజ్యప్రకటనల ద్వారా సెరెనాకు సమకూరిన ఆదాయం 28.9 మిలియన్ డాలర్లు (రూ. సుమారు 192కోట్లు)తో అగ్రస్థానాన్ని ఆక్రమించి అత్యధిక సంపాదన గల మహిళా అథ్లెట్ గా నిలిచింది. ప్రస్తుతం టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్న సెరెనా ఆదాయంలో మేటి అనిపించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.
దీంతో వరుసగా 11 సంవత్సరాల నుంచి ఆదాయార్జనలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రష్యన్ భామ షరపోవాకు బ్రేక్ పడింది. ఈ ఏడాది 21.9 మిలియన్ డాలర్లు(రూ.దాదా146 కోట్లు) సంపాదనకే పరిమితమైన షరపోవా రెండో స్థానానికి పడిపోయింది. ఇది గతేడాది షరపోవా ఆదాయం కంటే ఎనిమిది మిలియన్ డాలర్లు(రూ.53కోట్లు) తక్కువ కావడం గమనార్హం. తన ఆటతీరు, అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రష్యా టెన్నిస్ స్టార్.. డ్రగ్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ వార్త షరపోవాతో పాటు అభిమానులకు, క్రీడాకారులకు, క్రీడా సంఘాలకు షాక్ కలిగించింది. కొన్ని కంపెనీలు షరపోవాతో ఎండార్స్మెంట్లను రద్దు చేసుకోవడంతో ఆమె ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.
2001లో డబ్ల్యూటీఏ టూర్లో పాల్గొన్న షరపోవా తక్కువ కాలంలోనే ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగింది. 2004లో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ సాధించిన ఈ రష్యా బ్యూటీ ఆ మరుసటి ఏడాదే 2005లో 18 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంది. 2005 నుంచి ఇప్పటివరకూ మహిళా అథ్లెట్ల సంపాదనలో షరపోవా అగ్రస్థానంలో ఉండటం విశేషం.