కెవ్... ‘కేక’! | Number One Tennis Queen .. cry ... | Sakshi
Sakshi News home page

కెవ్... ‘కేక’!

Published Fri, May 2 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

Number One Tennis Queen .. cry ...

రాకెట్ ప్రయోగించినప్పుడు...  విమానం టేకాఫ్ అయినప్పుడు... డిస్కోథెక్ లేదా లౌడ్ మ్యూజిక్ (స్పీకర్) విన్నప్పుడు... టపాసులు పేలినప్పుడు... సబ్‌వే నుంచి రైలు వెళ్లినప్పుడు... సిటీలో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు... ఇలా పలు సందర్భాల్లో వెలువడే శబ్దాలను విన్నప్పుడు చెవులు చిల్లులు పడ్డాయేమోనని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ సరదాగా టెన్నిస్ చూద్దామని వెళితే ఇలాంటి శబ్దాలు వినిపిస్తే..? కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇవే కేకలు, అరుపులను ఒక ఆయుధంగా టెన్నిస్ క్రీడాకారులు ఉపయోగించుకుంటున్నారు. దీనిని ‘గ్రంటింగ్’గా వ్యవహరిస్తారు. ఒకరిని మించి మరొకరు ‘కేక’ల్లో రికార్డులు బద్దలు కొడుతున్నారు.      
 - శ్యామ్ తిరుక్కోవళ్లూరు
 
 టెన్నిస్ క్వీన్.. అరుపులో నంబర్ వన్...

మరియా షరపోవా.. ఆటతో పాటు అందంతోనూ అభిమానులను కట్టిపడేస్తుంది. అయితే ఈ రష్యా అందాల భామ మ్యాచ్ ఆడుతున్న సమయంలో చెవుల్లో దూది పెట్టుకుని మరీ మ్యాచ్‌లు చూడాల్సిన పరిస్థితి.. ఎందుకంటే షరపోవా అరుపు అలా ఉంటుంది మరి. టెన్నిస్ క్వీన్‌గా పేరొందిన షరపోవా అరుపులోనూ క్వీన్ అనిపించుకుంటోంది. ఈమె మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆమె అరుపు గరిష్టంగా 101.2 డెసిబుల్స్(శబ్దాన్ని డెసిబుల్స్‌లో కొలుస్తారు)గా నమోదైంది.

జెట్ టేకాఫ్ అయినప్పుడు (120 డెసిబుల్స్)  సింహం గర్జించినప్పుడు (110 డెసిబుల్స్), లౌడ్ స్పీకర్ విన్నప్పుడు(110 డెసిబుల్స్) ఎలా ఉంటుందో షరపోవా మ్యాచ్‌లు ఆడేప్పుడు అరిచే అరుపు దాదాపుగా అలాగే ఉంటుందట. ఇక పోర్చుగల్‌కు చెందిన 21 ఏళ్ల మిచెల్లీ లార్చర్ డి బ్రిటో అయితే అనధికారికంగా షరపోవాను అధిగమించేసింది. ఓ టోర్నీలో మ్యాచ్ ఆడుతూ బ్రిటో 109 డెసిబుల్స్ శబ్దంతో కేక పెట్టింది. బ్రిటో అరుపు భరించలేక కొందరు అభిమానులు నిర్వాహకులకు ఫిర్యాదు చేశారట..ఇక టెన్నిస్ స్టార్లలో విక్టోరియా అజరెంకా (బెలారూస్), సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్  (అమెరికా), ఎలెనా బొవినా, అన్నా కోర్నికోవా, ఎలెనా దెమెంతియేవా (రష్యా), కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం) తమ అరుపులతో ప్రత్యర్థులకు, అభిమానులకు దడ పుట్టించారు. అయితే మొట్టమొదటి మహిళా గ్రంట్ ప్లేయర్  మోనికా సెలెస్.. తన అరుపుతో అప్పట్లో బాగా గుర్తింపు పొందింది.
 
ప్రత్యర్థులను దెబ్బతీసే ఆయుధం..!


ఏదైనా మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. ప్రత్యర్థిని దెబ్బకొట్టాలంటే ప్రతిభతో పాటు మానసికంగా పైచేయి సాధించడం కూడా ముఖ్యమే. క్రికెట్ లాంటి కొన్ని క్రీడల్లో స్లెడ్జింగ్‌తో ప్రత్యర్థులను రెచ్చగొడతారు. తద్వారా ఎదుటివాళ్లు చేసే పొరపాట్లను తమకు అనుకూలంగా మలుచుకుంటారు. టెన్నిస్ లాంటి కొన్ని క్రీడల్లో అది సాధ్యం కాదు కాబట్టి కొందరు ప్లేయర్లు కోర్టులో అరుపు అనే ఆయుధాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటు న్నారు. గట్టిగా అరుస్తూ ప్రత్యర్థికి చికాకు పుట్టేలా చేస్తున్నారు. . ఇటీవలి కాలంలో కొందరు ప్లేయర్లు కావాలనే ఎదుటివారి ఏకాగ్రతను దెబ్బతీసేలా అరుస్తున్నారని వింబుల్డన్ మాజీ మ్యాచ్ రిఫరీ అలెన్ మిల్స్ వెల్లడించారు. ‘ఈ మధ్య గట్టిగా అరవడం ప్లేయర్లకు బాగా అలవాటైంది. ప్రత్యర్థిపై మానసికంగా పైచేయి సాధించేందుకు గట్టిగా అరుస్తూ చికాకు పెట్టిస్తున్నారు’అని అలెన్ మిల్స్ అనే అంపైర్ చెప్పారు.
 
కోచింగ్‌లో అరుపు ‘ఫ్రీ’

టెన్నిస్ కోచింగ్‌లో ఇప్పుడు ఆటలో మెళకువలతో పాటు ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు ఎలా అరవాలో కూడా నేర్పిస్తున్నారట.. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.. ప్రపంచ వ్యాప్తంగా కొందరు కోచ్‌లు తమ కోచింగ్‌లో అరుపులను కూడా భాగం చేస్తున్నారట. ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు అరుపులను ఆయుధాలుగా చేసుకుంటున్నప్పటికీ.. ఆటలో నైపుణ్యం ఉన్న ప్లేయర్లపై అరుపు ప్రభావం తక్కువగా ఉంటున్నట్లు సైకాలజిస్టుల పరిశోధనలో తేలింది.
 
గాడ్ ఫాదర్... జిమ్మీ కానర్స్..

అమెరికా టెన్నిస్ దిగ్గజం, ఎనిమిదిసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ఏడుసార్లు రన్నరప్‌గా నిలిచిన జిమ్మీ కానర్స్ టెన్నిస్‌లో అరుపులకు ఆద్యుడుగా చెబుతారు. 70, 80 దశకాల్లో టెన్నిస్ కోర్టులో తన ఆటతోనే కాదు.. అరుపుతోనూ ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించాడు. ప్రస్తుతం పురుషుల టెన్నిస్‌లో కార్లోస్ బెరాక్, రఫెల్ నాదల్, డేవిడ్ ఫై తమ అరుపులతో ప్రత్యర్థులకు, అభిమానులకు దడ పుట్టిస్తున్నారు.
 
వీళ్లని ఆపేదెలా...

టెన్నిస్ కోర్టులో అరుపులపై అటు ప్లేయర్ల నుంచి, ఇటు అభిమానుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మహిళల టెన్నిస్ సంఘం స్పందించింది. టెన్నిస్ కోర్టులో అరుపులపై ధ్వని పరీక్షలు మొదలు పెట్టింది. ఇన్‌డోర్, అవుట్‌డోర్, గ్రాస్ కోర్టులు, క్లే కోర్టులు, హార్డ్ కోర్టులు, సింథటిక్ కోర్టులు ఇలా విభిన్నమైన వేదికలు, పరిసరాల్లో ఆటగాళ్ల అరుపులు ఎలా ఉంటున్నాయో పరీక్షిస్తోంది. ఇక 2012 వింబుల్డన్‌లో ప్లేయర్ల అరుపులను నిరోధించేందుకు ప్రయత్నించారు. అంపైర్లకు గ్రంటో మీటర్లను కూడా ఇచ్చారు. అయితే దీనిపై అరిచే ప్లేయర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. చివరికి అరుపులను తేలిగ్గా తీసుకోవాల్సి వచ్చింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement