షరపోవా.. అన్‌స్టాపబుల్‌ | Maria Sharapova Lifestyle In Sakshi Family | Sakshi
Sakshi News home page

అన్‌స్టాపబుల్‌

Published Fri, Feb 28 2020 4:57 AM | Last Updated on Fri, Feb 28 2020 7:33 AM

Maria Sharapova Lifestyle In Sakshi Family

బాయ్‌ఫ్రెండ్‌ అలెగ్జాండర్‌ గిల్కెస్‌తో షరపోవా

అన్‌స్టాపబుల్‌ : మై లైఫ్‌ సో ఫార్‌.. అని రెండున్నరేళ్ల క్రితం మారియా షరపోవా తన బయోగ్రఫీ రాసుకున్నారు. ఆపలేని ఎదుగుదల.. అని. ఆ పుస్తకం బయటికి రావడానికి కొద్దినెలల  ముందే.. పదిహేను నెలల నిషేధం తర్వాత ఆమె మళ్లీ టెన్నిస్‌లోకి వచ్చారు. రెండేళ్లు ఆడారు. అంతలోనే మళ్లీ రెండు రోజుల క్రితం రిటైర్‌మెంట్‌ని ప్రకటించారు. ఆమెను ఎవరూ ఆపలేదు. ఆమే ఆగిపోయారు. అంతమాత్రాన ఆమె ‘అన్‌స్టాపబుల్‌’ కాకుండా పోరు. టెన్నిస్‌లో రాణించడానికి షరపోవా ఎంత కష్టపడ్డారో.. టెన్నిస్‌ తర్వాత లైఫ్‌లోనూ ఎదగడానికి అంతగా కృషి చేస్తారని అంచనా వెయ్యడానికి ఆమె కెరీర్‌లోని మలుపులే కొలమానాలు.

షరపోవా క్యాండీ

సుగర్‌పోవా అనే క్యాండీ ఒకటి ఉంది. అది అమెరికాలో దొరుకుతుంది. పిల్లలకు ఎంతో ఇష్టమైనది. ఫన్నీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే స్వీట్‌గా ఉంటుంది. క్యాండీల వ్యాపారి జెఫ్‌ రూబిన్‌.. షరపోవా పేరు మీదే, ఆమెతో కలిసి సుగర్‌పోవా క్యాండీని సృష్టించాడు. దాని అమ్మకాలపై వచ్చే డబ్బు ‘షరపోవా చారిటీ’కి వెళుతుంది. ఒక సందర్భంలోనైతే షరపోవా తన పేరును సుగర్‌పోవాగా మార్చుకోవాలని కూడా అనుకున్నారు! అంతగా ఆ ప్రాడెక్ట్‌ ఇమేజ్‌ పెరిగిపోయింది.

షరపోవా ప్రాక్టీస్‌
ఆరవ యేట మాస్కోలోని మార్టినా నవ్రతిలోవా నడుపుతున్న టెన్నిస్‌ క్లినిక్‌లో చేరడం షరపోవా కెరీర్‌ను మలుపుతిప్పింది. మార్టినా ఈ చిన్నారిని ఫ్లారిడాలోని ఐ.ఎం.జి.అకాడమీకి రికమండ్‌ చేసింది! ఆండ్రీ అగస్సీ, మోనికా సెలెస్, అన్నా కోర్నికోవా లాంటి టెన్నిస్‌ దిగ్గజాలు ట్రైనింగ్‌ తీసుకున్న అకాడమీ అది. కానీ షరపోవా తండ్రి దగ్గర డబ్బుల్లేవు. అప్పు చేయాలి. డబ్బైతే అప్పు చేయగలడు కానీ, ఇంగ్లీషులో మాట్లాడలేడు కదా! ఇంట్లో ఎవ్వరికీ ఇంగ్లిష్‌ రాదు. ఆ భయంతో ఏడాది తాత్సారం చేసి ధైర్యం చేశాడు.

మరోవైపు వీసా నిబంధనలు తండ్రీ కూతుళ్లను మాత్రమే యు.ఎస్‌.లోకి రానిచ్చాయి. తల్లి ఎలీనా రెండేళ్ల పాటు భర్తకు, కూతురికి దూరంగా రష్యాలోనే ఉండిపోవలసి వచ్చింది. షరపోవా, ఆమె తండ్రి తొలిసారి ఆమెరికాలో అడుగుపెట్టేనాటికి వాళ్ల దగ్గరున్న డబ్బు 700 డాలర్లు. ఇప్పటి లెక్కల్లో సుమారు 47 వేల రూపాయలు. వాటిని జాగ్రత్తగా వాడుకుంటూనే ఫ్లారిడాలో ఇళ్లల్లో పాత్రలు కడగడం వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చెయ్యడం మొదలుపెట్టాడు తండ్రి. తర్వాతి ఏడాదికల్లా అకాడమీ ప్రవేశానికి అర్హమైన తొమ్మిదేళ్ల వయసు రాగానే కూతుర్ని ఐ.ఎం.జి.లో చేర్చాడు. ఇక షరపోవాకి ట్యూషన్‌ ఫీజు, ఇంత సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ అకాడమీవే. అలా కెరీర్‌తో పాటు, షరపోవా జీవితం కూడా యు.ఎస్‌.తో ముడిపడిపోయాయి. ఆటల్లోనే కాదు, చారిటీల్లో కూడా ఆమె పెద్ద సెలబ్రిటీ అయ్యారు. 

షరపోవా ‘తప్పు’
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు ముందు డ్రగ్‌ టెస్ట్‌ చేసినప్పుడు ఆమె ఒంట్లో ‘మెల్డోనియం’ అనే మందు బయటపడింది. అదేమీ నిషేధించిన ఔషధం కాదు. అప్పటికి పదేళ్లుగా ఆమె తన ఆరోగ్యం కోసం తనకు తెలియకుండానే మెల్డోనియం కలిసి ఉన్న మెడిసిన్‌ని వాడుతున్నారు. వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ కొత్తగా విడుదల చేసిన నిషేధిత ఔషధాలలో దానిని కూడా చేర్చడంతో షరపోవా దోషి కావలసి వచ్చింది! అందుకు పడిన శిక్ష ఆట నుంచి పదిహేను నెలల బ్యాన్‌!  

షరపోవా ఆట
 
షరపోవా రష్యన్‌ ప్రొఫెషనల్‌ ప్లేయర్‌. ఇరవై ఐదేళ్లుగా యు.ఎస్‌.లో ఉంటున్నారు. ఒలింపిక్‌ మెడలిస్ట్‌. టెన్నిస్‌ కోర్టులో గర్జించే సింహం. 6 అడుగుల 2 అంగుళాల ఎల్తైన మనిషి. ఆమెకు మాత్రమే ప్రత్యేకమైన ఆ స్వింగింగ్‌ వ్యాలీలు ప్రత్యర్థుల గుంyð ల్ని కిందికి జారుస్తాయి. ఒక ఆట గెలిచినప్పుడు షరపోవా వెంటనే తర్వాతి ఆటకు ప్రాక్టీస్‌ మొదలు పెడతారు! ఆటలో ఓడిపోయినప్పుడు ఆ ప్రెజర్‌ నుంచి బయట పడడానికి షాపింగ్‌కి వెళతారు!

షరపోవా ‘రీబర్‌’

సోవియెట్‌ యూనియన్‌లో చెర్నోబిల్‌ అణు ప్రమాదం సంభవించిన తర్వాత ఏడాదికి న్యాగన్‌ పట్టణంలో షరపోవా పుట్టింది. ఆ పట్టణం చెర్నోబిల్‌ దుర్ఘటన జరిగిన ప్రిప్యత్‌ పట్టణానికి 3,500 కి.మీ. దూరంలో ఉంటుంది. చెర్నోబిల్‌ ప్రమాద ప్రభావం పడకుండా ఉండేందుకు షరపోవా తల్లిదండ్రులు ప్రిప్యత్‌ నుంచి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా వెళ్లిన తర్వాతే బిడ్డను కనాలని నిర్ణయించుకుని న్యాగన్‌లో తలదాచుకున్నారు. చెర్నోబిల్‌ ప్రమాదం 1986 ఏప్రిల్‌ 26న జరిగింది. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ అదే రోజున నిషేధం తర్వాత షరపోవా తన ‘రీబర్త్‌’ టెన్నిస్‌ను ఆడారు. 

షరపోవా స్నేహం
పద్దెనిమిదవ యేటే టెన్నిస్‌లో ఆమె వరల్డ్‌ నెం.1 ర్యాంకులోకి వచ్చేశారు. ఆదే ఏడాది 18వ బర్త్‌డే పార్టీలో అమెరికన్‌ పాప్‌ రాక్‌ బ్యాండ్‌ మెరూన్‌ 5 సింగర్‌ ఆడమ్‌ లెవీన్‌ ఆమెకు పరిచయం అయ్యాడు. తర్వాత అమెరికన్‌ టెలివిజన్‌ ప్రొడ్యూజర్‌ చార్లీ ఎబర్సోల్‌ ఆమె జీవితంలోకి వచ్చాడు. తర్వాత స్లొవేనియా బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ సషా ఉజాసిక్, తర్వాత బల్గేరియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ గ్రిగర్‌ దిమిత్రోవ్‌. ప్రస్తుతం ఆమె బాయ్‌ఫ్రెండ్‌ అలెగ్జాండర్‌ గిల్కెస్‌. షరపోవా రిటైర్మెంట్‌ని ప్రకటించినప్పుడు ఆమె కెరీర్‌ను కొనియాడుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.

షరపోవా రాకెట్‌
షరపోవాకు రెండేళ్ల వయసులో ఆమె కుటుంబం సోచ్‌ సిటీకి మారింది. అక్కడ ఆమె తండ్రికి అలెగ్జాండర్‌ కఫెల్నికోవ్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అలెగ్జాండర్‌ తన పద్నాలుగేళ్ల కొడుకు ఎవ్‌జెనీకి టెన్నిస్‌లో శిక్షణ ఇప్పిస్తున్నప్పుడు వారి పరిచయం జరిగింది. తర్వాత రెండేళ్లకు తండ్రితో పాటు ఆట చూడడానికి వచ్చిన షరపోవాను చూసి ముచ్చట పడి ఆ చిన్నారికి కూడా ఓ టెన్నిస్‌ రాకెట్‌ కొనిచ్చాడు అలెగ్జాండర్‌. అదే తొలిసారి షరపోవా రాకెట్‌ పట్టుకోవడం. లోకల్‌ పార్క్‌లో చాలాకాలం పాటు ఆ రాకెట్‌తోనే ఆడింది. తర్వాత రష్యన్‌ కోచ్‌ యూరి యట్కిన్‌ దగ్గర టెన్నిస్‌ పాఠాలు నేర్చుకుంది. తొలి ఆటలోనే షరపోవాలోని అతి ప్రత్యేకమైన ‘హ్యాండ్‌–ఐ కోఆర్డినేషన్‌’ని గమనించాడు కోచ్‌. 

షరపోవా కోపం

కోపంగా ఉన్నప్పుడు షరపోవా రాకెట్‌తో లాగిపెట్టి టెన్నిస్‌ బంతిని కొడతారు. అవతల ఎవరూ ఉండరు. ప్రాక్టీస్‌ వాల్‌ను పిడిగుద్దులు గుద్దినట్టుగా బంతిని వాల్‌ పైకి ఈడ్చి కొడుతూనే ఉంటారు. ఊరికినే తనకు కోపం రాదు. వస్తే ఊరికే ఉండిపోదు. కోపం తీర్చుకుంటుంది. ఎదురుగా ఉన్న గోడల్ని బంతులతో పగలగొడుతుంటారు.

షరపోవా యోగా

పదిహేను నెలల నిషేధంలో షరపోవా యోగా, ధ్యానం సాధన చేశారు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో చేరారు. మంచి మంచి బుక్స్‌ చదివారు. బయోగ్రఫీ రాశారు. బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. ఆట నుంచి బ్యాన్‌ అవగానే చాలామందే చికాకు పరిచారు ఆమెను. మొదటగా డేవిడ్‌ హెగర్టీ! ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌. ఆమె బ్యాన్‌ నిర్ణయం అతడిదే. ఇంకా.. సాటి ప్లేయర్‌లు జాన్‌ మెకెన్రో, ప్యాట్‌ క్యాష్, జెన్నిఫర్‌ కాప్రియాటీ, సెరెనా విలియమ్స్, రోజర్‌ ఫెదరర్, రాఫెల్‌ నాదల్, ఆండీ ముర్రే, నొవాక్‌ జకోవిక్‌..  తలో మాటా అన్నారు. ‘ఇలా చేసిందంటే నమ్మలేక పోతున్నాం’ అని ఒకరు, ‘తన టైటిళ్లనీ వెనక్కు తీసేసుకోవాలి’ అని ఒకరు, ‘సారీ చెప్పినా ఒప్పుకోవద్దని ఒకరు’... తలో రాయి విసిరారు. షరపోవా ఎవరికీ సారీ చెప్పలేదు. వీళ్లందర్నీ క్షమించేయడానికి బాక్సింగ్‌ కన్నా, ధ్యానం ఆమెకు ఎక్కువ ఉపయోగపడింది. 

షరపోవా బాల్యం
బాల్యం నుంచి దూరంగా వచ్చేస్తున్నకొద్దీ, బాల్యం ఆమె దగ్గరగా రావడం షరపోవా జీవితంలోని ఒక విశేషం. చిన్నపిల్ల నవ్వు, చిన్నపిల్ల వెక్కిరింపు ఇవెక్కడికీ పోలేదు. ఆమె దగ్గర చిన్నప్పటి స్టాంప్‌ కలెక్షన్‌ ఇంకా పోగవుతూనే ఉంది. చిన్నప్పటి ఆమె జ్ఞాపకాల సుగంధ పరిమళం స్టెల్లా మెకార్ట్నీ ఎప్పుడూ ఆమెను అంటుకునే ఉంటుంది! పిప్పీ లాంగ్‌స్టాకింగ్‌ బుక్స్‌ కూడా ఇంకా చదువుతూనే ఉన్నారు షరపోవా. పిప్పీ లాంగ్‌స్టాకింగ్‌ అనేది స్వీడిష్‌ రచయిత్రి ఆస్ట్రిడ్‌ లిండ్‌గ్రెన్‌ నవలల్లోని ఒక అమ్మాయి క్యారెక్టర్‌. పిప్పీ జుట్టు ఎర్రగా ఉంటుంది. రెండు జడలు ఉంటాయి. స్ట్రాంగ్‌గా ఉంటుంది. సింగిల్‌ హ్యాండ్‌తో తన గుర్రాన్ని అదుపు చేస్తుంటుంది. చురుగ్గా ఉంటుంది. ఎప్పుడేం చేస్తుందో చెప్పలేనంత ఎగై్జటింగ్‌గా ఉంటుంది. ఆ పాత్రలో తనను తను చూసుకున్నట్లుంది షరపోవా. అందుకే పిప్పీ అంటే అంతిష్టం. మిగతా పిల్లల సాహిత్యాన్ని కూడా ఆసక్తిగా చదువుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement