
న్యూయార్క్: అమెరికన్ టెన్నిస్ స్టార్, నల్లుకలువ సెరెనా విలియమ్స్ అరుదైన రికార్డుకు చేరువలో నిలిచారు. యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లో సెరెనా విలియమ్స్ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్ 6-3,6-1 తేడాతో ఎలీనా స్వితోలినా(ఉక్రెయిన్)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. సెరెనా ధాటికి స‍్వితోలినా కనీసం పోటీ ఇవ్వకుండానే తన పోరును ముగించారు. అద్భుతమైన ఏస్‌లతో చెలరేగిపోయిన సెరెనా.. ఎక్కడా కూడా స్వితోలినాకు అవకాశం ఇవ్వలేదు. దాంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఈ క్రమంలోనే సెరెనా ముంగిట అరుదైన రికార్డు నిలిచింది. (ఇక్కడ చదవండి: ఒక్కడే మిగిలాడు)
ఓపెన్ శకంలో అత్యధికంగా యూఎస్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను సాధించే అవకాశం ఇప్పుడు సెరెనాను ఊరిస్తోంది. ఇప్పటివరకూ ఆరు యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన సెరెనా.. మరో టైటిల్ సాధిస్తే అత్యధికంగా యూఎస్ ఓపెన్ టైటిల్స్‌ను గెలిచిన క్రీడాకారిణిగా కొత్త అధ్యాయాన్ని లిఖిస్తారు. ఓపెన్ శకం ఆరంభమైన తర్వాత సెరెనా-క్రిస్ ఎవర్ట్‌లు మాత్రమే ఎక్కువసార్లు యూఎస్ ఓపెన్ గెలిచిన క్రీడాకారిణులు. ఇప్పుడు ఎవర్ట్‌ను అధిగమించడానికి సెరెనా అడుగు దూరంలో నిలిచారు. ఆదివారం జరుగనున్న అమీతుమీ పోరులో బియాంక ఆండ్రిస్యూ(కెనడా)తో తలపడతారు. మహిళల సెమీ ఫైనల్లో బెలిందా బెన్సిక్‌ను ఓడించడం ద్వారా బియాంక ఫైనల్‌కు చేరారు.
2017 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించిన తర్వాత మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అనేది సెరెనాకు అందని ద్రాక్షగానే ఉంది. గతేడాది యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరినప్పటికీ జపాన్ క్రీడాకారిణి ఒసాకా చేతిలో సెరెనా పరాజయం పాలై రన్నరప్‌గా సరిపెట్టుకున్నారు. 2014లో చివరిసారి యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను గెలిచారు సెరెనా. దాంతో ఈసారైనా టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంగా సెరెనా బరిలోకి దిగుతున్నారు. 10 సార్లు యూఎస్ ఓపెన్ సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన సెరెనా.. ఏడోసారి టైటిల్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మరో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలిస్తే.. అత్యధిక సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన మార్గరెట్ కోర్టు(24 గ్రాండ్ స్లామ్‌టైటిల్స్) ఆల్ టైమ్ రికార్డును సెరెనా సమం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment